కరోనా రెండోదశ, లాక్‌డౌన్ ప్రభావం తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంపై గట్టిగానే పడింది. జూన్ నెలతో ముగిసిన తొలిత్రైమాసికంలో కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్-కాగ్ నివేదిక ప్రకారం ప్రభుత్వ ఆదాయం అంచనాల్లో 13.98 శాతం చేరుకుంది. బడ్జెట్‌లో ఆదాయం అంచనా రూ. 1,76,126 కోట్లు కాగా... జూన్ నెలాఖరు వరకు రూ. 24,629 కోట్లు ఖజానాకు చేరింది. అందులో పన్ను ఆదాయం రూ. 20,225 కోట్లు, పన్నేతర ఆదాయం రూ. 903 కోట్లు, కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు రూ. 3,499 కోట్లుగా ఉన్నాయి.
ఖజానాకు రూ. 5,878 కోట్లు...
అమ్మకం పన్ను ఆదాయం అంచనాల్లో 22.18 శాతం చేరుకోవడం ద్వారా రూ. 5,878 కోట్లు ఖజానాకు చేరాయి. ఎక్సైజ్ రాబడి అంచనాల్లో 20.74 శాతం చేరుకోవటం ద్వారా రూ. 3,526 కోట్ల ఆదాయం వచ్చింది. జీఎస్టీ ద్వారా రూ. 6,640 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 1,668 కోట్ల ఆదాయం సమకూరింది. కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటాగా రూ. 1,501 కోట్లు వచ్చాయి. ఏప్రిల్ నెలలో రూ. 7,618 కోట్ల ఆదాయం రాగా... మే నెలలో అది రూ. 5,579 కోట్లకు తగ్గింది.
జూన్‌లో రూ. 7,027 కోట్ల రాబడి వచ్చింది. మొదటి త్రైమాసికంలో ప్రభుత్వం రూ. 12,891 కోట్ల రుణం తీసుకుంది. ఏప్రిల్‌లో రూ. 1,925కోట్లు, మేలో గరిష్టంగా రూ. 6,684కోట్లు, జూన్‌లో రూ. 4,281 కోట్ల అప్పు చేసింది. బడ్జెట్లో ప్రతిపాదించిన అప్పు రూ. 45,509 కోట్లు కాగా... ఇప్పటివరకు తీసుకున్న రుణం 28.32శాతానికి చేరింది. ఈ ఏడాది జూన్ వరకు తెలంగాణ ప్రభుత్వం రూ. 33,038కోట్లు ఖర్చు చేసింది. బడ్జెట్లో ప్రతిపాదించిన రూ. 1,98,430 కోట్ల వ్యయంలో ఇది 16.65 శాతంగా ఉంది.
ఇదీచూడండి: CABINET MEETING: ఆగస్టు 1న కేబినెట్ భేటీ... పలు కీలకాంశాలపై చర్చ