Revenue of Telangana Commercial Taxes Department: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ రాబడులను సమకూర్చనుంది. 2022-23 ఆర్థిక ఏడాది 75,189 కోట్ల రాబడిని నిర్దేశించగా ఆ తర్వాత 72,500 కోట్లకి సవరించారు. గడిచిన ఫిబ్రవరి వరకు 65,276.19 కోట్లు రావడంతో నిర్దేశించిన లక్ష్యంలో 90శాతాన్ని చేరుకుంది. ఫిబ్రవరిలో పన్నుల వసూళ్లు పెరగడంతో పాటు కేంద్రం నుంచి పెండింగ్ జీఎస్టీ పరిహారం కింద 547 కోట్లు రావడంతో ఏకంగా 30శాతం అధికంగా ఆదాయం వచ్చింది. ఈ 11 నెలల్లో వచ్చిన 65,276.19 కోట్ల ఆదాయాన్ని గత ఆర్థిక ఏడాదితో పొలిస్తే 12శాతం వృద్ధి నమోదు చేసింది.
గత 11 నెలలుగా రాబడుల వివరాలు: ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు రాబడుల సరళిని పరిశీలించినట్లయితే ఏప్రిల్‌లో 18శాతం, మేలో 52శాతం, జూన్‌లో 30శాతం లెక్కన రాబడుల్లో వృద్ధి నమోదు కాగా జులైలో ఏకంగా 17శాతం ఆదాయం తగ్గింది. ఆగస్టులో 25శాతం, సెప్టెంబరులో 9శాతం అధిక రాబడులు రాగా, అక్టోబరులో 15శాతం రాబడి పడిపోయింది. అదేవిధంగా నవంబరులో 16శాతం, డిసెంబర్‌లో 20శాతం లెక్కన అధిక ఆదాయం రాగా జనవరిలో స్వల్పంగా 2శాతం తగ్గింది. ఫిబ్రవరిలో పన్నుల వసూళ్లు పెరగడంతో పాటు రూ.547 కోట్లు కేంద్రం నుంచి పెండింగ్ జీఎస్టీ పరిహారం రావడంతో ఏకంగా 30శాతం అదికంగా ఆదాయం వచ్చింది. 2022-23 ఆర్థిక ఏడాదిలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు మార్చిలో మరో 7,223.81 కోట్లు రావాల్సి ఉంది. ఐతే ఈనెలలో పెండింగ్ జీఎస్టీ పరిహారం 12వందల కోట్లు కేంద్రం ఇప్పటికే విడుదల చేయడంతో మార్చి నెలలో 7 వేల కోట్లు కంటే ఎక్కువ ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పాక బకాయిల వసూళ్ల తదితర చర్యల వల్ల పెరిగిన ఆదాయం: వ్యాట్, జీఎస్టీల ద్వారా వస్తున్న ఆదాయంలో వృద్ధి నమోదైంది. గడిచిన 11 నెలల్లో పెట్రోల్ ఉత్పత్తుల అమ్మకం ద్వారా 13,849.31 కోట్ల వ్యాట్ రాబడితో 14శాతం వృద్ధి నమోదైంది. మద్యం విక్రయాల ద్వారా రూ.13,026.64 కోట్లు ఆదాయంతో 6శాతం వృద్ధి నమోదు చేసింది. వృత్తిపన్ను 25 శాతం, జీఎస్టీ 28శాతం లెక్కన వృద్ధి నమోదు చేశాయి. కొంతకాలంగా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పన్ను ఎగవేతదారులపై నిఘా పెట్టడం, అసెస్‌మెంట్లు నిర్వహించడం, వాహన తనిఖీలు ముమ్మరం చేయడం, పాత బకాయిల వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం వంటి చర్యలతో పన్నుల రాబడి క్రమంగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
అక్రమార్కులను తెలుసుకునేందుకు కొత్త సాప్ట్‌వేర్: ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న ఐజీఎస్టీని గుర్తించి రాష్ట్రానికి వచ్చేలా చర్యలు చేపట్టడంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర కర్ణాటక, తమిళనాడుకి వెళ్లిన దాదాపు 500 కోట్లు రాష్ట్ర ఖజానాకి చేరాయి. అక్రమార్కుల భరతం పట్టేందుకు హైదరాబాద్ ఐఐటీ బృందం సహా కొందరు సీనియర్ అధికారులు కలిసి అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొత్త సాప్ట్‌వేర్ అందుబాటులోకి తెచ్చారు. తద్వారా రెండు నుంచి మూడు వేల కోట్లు అదనంగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి: