ఇది సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ రెవెన్యూ భవనం. ఇందులో ఉన్న ఆర్డీవో కార్యాలయంలో 14 మంది, తహసీల్దారు ఆఫీసులో 18 మంది, ఎస్టీవో కార్యాలయంలో 8 మంది విధులు నిర్వహిస్తున్నారు. 127 ఏళ్ల క్రితం నిర్మించిన భవంతి ఇది. వెనుక గదులు రెండేళ్ల క్రితం కూలాయి. మిగతా భవనం వర్షానికి కురుస్తుండటంతో స్లాబుపై రేకులు వేశారు. గదుల్లోకి రావి చెట్టు ఊడలు దిగాయి. పైకప్పు పెచ్చులు ఊడుతున్నాయి. ఉద్యోగులు భయంభయంగా విధులు నిర్వహిస్తున్నారు. మరమ్మతులకు రూ.కోటి మంజూరుకు ప్రతిపాదనలు పంపినా.. స్పందన లేదని చెబుతున్నారు.
1996లో నిర్మించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల తహసీల్దారు కార్యాలయం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. వానొస్తే గదులన్నీ తటాకాలే. సిబ్బంది ఏదో ఒక మూల కుర్చీ వేసుకుని సర్దుకోవాలి. దస్త్రాలపై గొడుగు అడ్డం పెట్టాల్సిందే. కనీస మరమ్మతులకు ఏడాది కిందట ప్రతిపాదనలు పంపినా పైసా విడుదుల కాలేదు.
ఈ రెండు చోట్లే కాదు..
- రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 140 మండలాల్లో తహసీల్దార్ ఆఫీసుల్లో సరైన బీరువాలు, రక్షణ గదులు లేవు. రికార్డు అసిస్టెంట్ల నియామకాలు జరగడం లేదు.
- 2020లో ధరణి పోర్టల్ ఆవిర్భావం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్లు, ప్రింటర్లతోపాటు రిజిస్ట్రేషన్ల గది ఏర్పాటుకు ఒక్కో మండలానికి రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో జరిగిన పనులు చూస్తే మండలాలకు చేరిన నిధులు ఎన్ననేది అంచనా వేయొచ్చని కొందరు అధికారులు చెప్పకనే చెబుతున్నారు.
మరికొన్ని శిథిల సాక్ష్యాలు..
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావల, ఆదిలాబాద్ గ్రామీణం, కౌటాల, రెబ్బెన కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి.
- మహబూబాబాద్ జిల్లా పాకాల కొత్తగూడ తహసీల్దారు కార్యాలయం 1985లో ఐటీడీఏ ఉపాధ్యాయుల క్వార్టర్‌లో ఏర్పాటు చేశారు. దాన్నే మరమ్మతు చేసి నెట్టుకొస్తున్నారు. ఇదే జిల్లా గంగారం మండలంలో రెండు పాత గదుల్లో కార్యాలయం కొనసాగుతోంది.
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల తహసీల్దార్ కార్యాలయం పాత భవనం పైకప్పును మరమ్మతు చేసి నడిపిస్తున్నారు.
- సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి తహసీల్దార్ కార్యాలయం పాతభవనంలోనే ఉంది.
- పూర్తి స్థాయి సీసీఎల్‌ఏ లేకపోవడం కూడా ఈ సమస్యలకు ఓ కారణమని రెవెన్యూవర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
ఇదీ చూడండి: కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసం సమగ్ర సర్వే