Revanthreddy on Karnataka Results : కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ గాంధీభవన్ కార్యకర్తలతో కళకళలాడుతోంది. పార్టీ మెజార్టీ స్థానాల వైపునకు దూసుకుపోతుండటంతో కార్యకర్తల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కార్యకర్తలు గాంధీభవన్‌కు చేరుకుని విజయోత్సవాల్లో మునిగిపోయారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ రేవంత్ రెడ్డి నిలోఫర్ ఆసుపత్రి వద్ద ఉన్న హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ మాణిక్ రావ్ ఠాక్రే, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి తదితర నేతలు ఉన్నారు.
కర్ణాటకలో వచ్చిన ఫలితాలే రాష్ట్రంలోనూ వస్తాయి: ఈ సందర్భంగా విద్వేష విభజన రాజకీయాలకు కన్నడ ప్రజలు చరమగీతం పాడారని.. ఇవాళ కర్ణాటకలో వచ్చిన ఫలితాలే రేపు తెలంగాణలో రాబోతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దేశంలో కూడా కర్ణాటకలో వచ్చిన ఫలితాలే వస్తాయన్నారు. కర్ణాటకలో బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని.. కాంగ్రెస్ వైపు స్పష్టమైన తీర్పు ఇస్తున్నారని తెలిపారు. శ్రీరాముడిని అడ్డుపెట్టుకుని పార్టీ విస్తరించాలనుకోవడం బీజేపీ మానుకోవాలని హితవు పలికారు. భజరంగ్‌దళ్‌ను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలని చూశారని ఆక్షేపించారు. కర్ణాటకలో బీజేపీని ఓడించి మోదీని.. జేడీఎస్‌ను ఓడించి కేసీఆర్‌ను తిరస్కరించారని తెలిపారు. ఎంఐఎం విధానాన్ని ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు.
'కర్ణాటక ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతం అవుతాయి. కర్ణాటక ఫలితాలు.. దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు శ్రీకారం. కేంద్రం, రాష్ట్రంలో వచ్చేది కర్ణాటక ఫలితాలే. కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్‌ను ప్రజలు తిరస్కరించారు. కర్ణాటకలో కాంగ్రెస్ వైపు స్పష్టమైన తీర్పు ఇస్తున్నారు. కర్ణాటకలో బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారు. దేశంలో ఇవే ఫలితాలు రాబోతున్నాయి.'-రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
కర్ణాటకలో ముందు నుంచి తాము ఊహించిన ఫలితాలే వచ్చాయని రేవంత్ అన్నారు. మతాన్ని రాజకీయం చేయాలనుకుంటే కర్ణాటక లాంటి ఫలితాలే ఉంటాయని తెలిపారు. తాను హిందువునని.. తన విశ్వాసం మేరకు పూజలు చేస్తానని స్పష్టం చేశారు. బీజేపీ ఇప్పటి వరకు తొమ్మది రాష్ట్రాలలో ఫిరాయింపు రాజకీయాలు చేసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
ఇవీ చదవండి: