Revanthreddy Meets Ponguleti Tomorrow : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి రేపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పొంగులేటి నివాసంలో జూపల్లి, పొంగులేటితో పాటు వారి అనుచరులతో రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు. పార్టీలోకి రావాల్సిందిగా అధికారికంగా రేవంత్‌రెడ్డి వారిని ఆహ్వానించనున్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు వారి అనుచరులకు సమాచారం ఇచ్చారు. పొంగులేటితో పాటు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కూడా రేవంత్ సమావేశానికి హాజరు అవుతారు.
కాంగ్రెస్‌లో చేరడంపై వారు రేపు అధికారిక ప్రకటన చేసే అవకాశం : అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 22వ తేదీన దిల్లీకి రానున్నారు. రాహుల్ వచ్చిన వెంటనే ఆయనతో రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నట్లు సమాచారం. అదే విధంగా బుధవారం రేవంత్‌తో భేటి అనంతరం పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ నెల 23వ తేదీన పొంగులేటి, జూపల్లిలతో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలు దిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
BRS Leaders To Join In Congress : మరోవైపు కాంగ్రెస్‌లో చేరికల జోష్ కన్పిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ, భారత్ రాష్ట్ర సమితి ముఖ్య నాయకులను హస్తం గూటికి రప్పించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల చివరి వారంలో పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశాలు ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డిలు కూడా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వీరుకాకుండా హస్తం నుంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్లిన నాయకులను ఘర్‌వాపసి పేరుతో తిరిగి పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఇందులో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన అన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా.. తిరిగి హస్తం పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ప్రియాంక గాంధీని కలిసినప్పుడు కూడా రాజగోపాల్‌రెడ్డి ప్రస్తావన తీసుకురాగా రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో చర్చించాలని ఆమె సూచించినట్లు తెలిసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కూడా ఏఐసీసీ పెద్దలను తరచూ కలుస్తున్నట్లు తెలుస్తోంది. నెలాఖరున సభలు నిర్వహించి చేరికలు పూర్తయితే పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం వస్తుందని, ఎన్నికల సమయానికి కొత్త చేరికలు క్యాడర్‌లో జోష్ నింపుతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇవీ చదవండి :