Revanth Reddy Open letter to CM KCR : ఇప్పటికే అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం(Midday Meals Scheme)లో సమస్యలను పట్టించుకోకుండా.. రాష్ట్రప్రభుత్వం సీఎం బ్రేక్ ఫాస్ట్(CM Breakfast Scheme) అంటూ హడావుడి చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖను రాశారు. చదువుకుంటున్న పిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే స్థితికి బీఆర్‌ఎస్ దిగజారిందంటూ ఆరోపణలు చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెంచడంతో పాటు.. పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం ఈ ప్రభుత్వంలో అనేక సమస్యలను ఎదుర్కొందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మార్కెట్‌లో ధరలు భగ్గుమంటుంటే ప్రభుత్వం మాత్రం పెరిగిన ధరలకు అనుగుణంగా బడ్జెట్‌ను పెంచడం లేదని మండిపడ్డారు. కనీసం ఆ ధరలను సవరించడం లేదు.. సరికదా మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేస్తూ వంట కార్మికులకు ఆర్థిక భారంతో పాటు పని భారం పెంచుతున్నారని ధ్వజమెత్తారు.
Revanth Reddy Letter on Midday Meals Scheme : చాలా పాఠశాలల్లో వంట గదులే సక్రమంగా లేవని.. గతంలో నిర్మించినవి ఇరుకుగా ఉండడం.. శిథిలావస్థకు చేరడం జరిగాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ కారణాలతో ఆరు బయట, చెట్ల కింద కార్మికులు వంటలు కొనసాగిస్తున్నారన్నారు. ఇలాంటి వాటి వల్ల అక్కడక్కడ భోజనం కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురైన సందర్భాలను చూశామని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న.. ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు.
మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన జీతాలను విడుదల చేయాలని.. నూతన మెనూకు బడ్జెట్‌ను పెంచాలని.. జీవో 8 ప్రకారం పెరిగిన వేతనాలను ఎరియర్స్‌తో సహా వెంటనే చెల్లించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులకు ఐడీ కార్డులు, యూనిఫాం ఇవ్వాలని.. నిత్యావసర వస్తువులను ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు.
CM Breakfast Scheme in Telangana : మరోవైపు రాష్ట్రంలో గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ అధ్వానంగా తయారైందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. మెనూ ప్రకారం ఎక్కడా భోజనం వడ్డించడం లేదని.. నాణ్యత ప్రమాణాలను పాటించడం లేదని.. ఉడికీ ఉడకని ఆహారం తినడం, నీరు, పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురైన సంఘటనలు చూశామన్నారు. నాణ్యమైన ఆహారం అందించాలని విద్యార్థులు రోడెక్కిన సంఘటనలను కూడా అనేకం చూశామని గుర్తు చేశారు. ఇప్పుడు అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని సరిగ్గా అమలు చేయడం లేదు కానీ మరోవైపు సీఎం బ్రేక్ ఫాస్ట్ అంటూ ప్రచార ఆర్భాటానికి పాల్పడుతూ రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో లేఖలో విమర్శలు చేశారు.
CM Breakfast Scheme in Telangana 2023 : సీఎం అల్పాహార పథకం ప్రారంభం.. మెనూ ఏంటో తెలుసా..?
Revanth Reddy Latest News : 'బీఆర్‌ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే.. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి'