Revanth Reddy Reaction on Jamili Elections : ఇండియా కూటమి వన్ నేషన్- వన్ ఎలక్షన్ విధానానికి వ్యతిరేకమని.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అందువల్లే కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ నుంచి అధిర్ రంజన్ చౌదరి వైదొలగారని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా దేశంలో.. జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతుందని (Revanth Reddy on Jamili Elections) తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy Comments on BRS and BJP : కర్ణాటక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ గల్లీ గల్లీ ప్రచారం చేసినా.. బీజేపీని అక్కడి ప్రజలు తిరస్కరించారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. మణిపూర్ అంశం చర్చకు వచ్చినా.. మోదీ పార్లమెంట్‌కు రాలేదని.. ఇతర అంశాలతో ప్రజలను పక్కదోవ పట్టించారని ఆరోపించారు. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. ఓడిపోతామనే భయంతోనే జమిలి ఎన్నికలను ముందుకు తెచ్చారని ఆరోపించారు. తెలంగాణలో హస్తం పార్టీకి 38 శాతం, బీఆర్‌ఎస్‌కు 31 శాతం ఓటర్లు ఉన్నట్లు.. సీ ఓటర్ సర్వే స్పష్టం చేసిందని రేవంత్‌రెడ్డి (Revanth Reddy on Telangana Elections) వివరించారు.
Telangana Assembly Elections 2023 : 'వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 70 స్థానాలకు పైగా గెలుస్తుంది'
బీజేపీ ఎన్డీయే కూటమికి అవమానకర పరిస్థితి ఎదురవుతుందన్న భావనతోనే.. వన్ నేషన్- వన్ ఎలక్షన్‌ను తెరపైకి తెచ్చినట్లు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ జమిలి ఎన్నికలకు అనుకూలమని 2018లో కేంద్రానికి రాసిన లేఖను.. రేవంత్ బయటపెట్టారు. బీజేపీతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని చెబుతున్న సీఎం.. దీనిపై బీఆర్‌ఎస్ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ను దెబ్బ తీయడానికి జరుగుతున్న కుట్రకు కేసీఆర్ సహకరిస్తున్నారని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు.
మరోవైపు బీజేపీ తీసుకువచ్చిన ప్రతి బిల్లుకు.. బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఆ రెండు పార్టీలు వేర్వేరు కాదని.. ఒకే తాను ముక్కలని విమర్శించారు. అధ్యక్ష తరహా ఎన్నికలను తీసుకు వచ్చేందుకే కమలం పార్టీ వన్ నేషన్- వన్ ఎలక్షన్ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చిందని ఆరోపించారు. దీని వెనక పెద్ద కుట్ర దాగుందని.. ఇది దేశ ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
"కర్ణాటకలో మోదీ, అమిత్‌షా 30 రోజులు ప్రచారం చేసినా బీజేపీ గెలవలేదు. మాయ మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరు. వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేలు చెప్తున్నాయి. ఓడిపోతామనే భయంతోనే జమిలి ఎన్నికలను ముందుకు తెచ్చారు. జమిలి ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. జమిలి ఎన్నికలకు బీఆర్ఎస్ అనుకూలంగా ఉంది. జమిలి ఎన్నికలకు సమ్మతి తెలుపుతూ 2018లో కేసీఆర్ లేఖ రాశారు. జమిలి ఎన్నికలపై బీఆర్ఎస్ ప్రస్తుత వైఖరి ఏమిటి? అధ్యక్ష తరహా ఎన్నికలు వస్తే దక్షిణాది ఉనికే ప్రశ్నార్థకం." - రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
Revanth Reddy will contest in Kodangal : ' వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచే పోటీచేస్తా'
Revanth Reddy challenged BRS : 'ఇందిరమ్మ ఇళ్లు ఉన్న చోట బీఆర్ఎస్ ఓట్లు అడగకూడదు..'