Revanth Reddy on Congress Candidates Announcement in Telangana : తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy ) ధీమా వ్యక్తం చేశారు. హస్తం పార్టీలోకి ఇంకా చేరికలు ఉంటాయని చెప్పారు. తమ పార్టీ సభకు బీఆర్ఎస్ సర్కార్ గ్రౌండ్‌ను కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ విజయవంతమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలకు గౌరవం, స్వేచ్ఛ లేదని వివరించారు. దిల్లీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలోనే ఏఐసీసీ కార్యాలయంలో రేవంత్‌రెడ్డి, మాణిక్‌రావ్ ఠాక్రే సమక్షంలో.. మాజీ మున్సిపల్ ఛైర్మన్ సంపత్, వ్యాపారవేత్త శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. వారికి రేవంత్‌రెడ్డి పార్టీ కండువా కప్పి.. హస్తం పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్తో రక్షణ లేదని ప్రజలు భావిస్తున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. త్వరలో తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని.. సగానికిపైగా సీట్లలో అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. ప్రజలు సామాజిక న్యాయం కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో నిర్బంధ పరిస్థితులు ఉన్నాయని.. కేసీఆర్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
"రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కాంగ్రెస్‌లో ఇంకా చేరికలు ఉంటాయి. కాంగ్రెస్ సభకు ప్రభుత్వం గ్రౌండ్‌ను కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ సభ విజయవంతమైంది. కేసీఆర్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు." - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
Revanth Reddy Open Letter to KCR : అంతకుముందు రేవంత్‌రెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా.. నిరుద్యోగుల జీవితం అగమ్యగోచరంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను హైకోర్టు రద్దు చేస్తూ ఉత్తర్వులివ్వడం.. ప్రభుత్వానికి చెంపపెట్టు అని పేర్కొన్నారు. పాలనా వ్యవస్థల విధ్వంసం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
Revanth Reddy on BRS Candidates List : 'కేసీఆర్ స్వరంలో ఓటమి భయం స్పష్టంగా కనిపించింది'
అన్యాయమైన, దుర్మార్గమైన పాలనకు విద్యార్ధులు, నిర్యుదోగుల చేతిలో శిక్ష తప్పదని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. తొలిదశ నుంచి మలిదశ వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో యువత, విద్యార్ధులదే కీలక పాత్ర అని పేర్కొన్నారు. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి వారు అడుగడునా పరాభావం ఎదురవుతున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ పేపర్ల మూల్యాంకనంలో దొర్లిన తప్పులతో 27 మంది విద్యార్ధుల ఆత్మహత్య చేసుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
Revanth Reddy Respond on Group 1 Prelims Exam Cancelled : 2015లో సింగరేణి మొదలు, ఎంసెట్ పేపర్ లీకేజీ, విద్యుత్ సంస్థ నియామక పరీక్ష పేపర్ లీక్, పదో తరగతి పేపర్ లీకులు వరకు.. అక్కడి నుంచి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో ప్రభుత్వ మోసం పరాకాష్ఠకు చేరిందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఇంత జరిగినా ప్రభుత్వంలో చలనం లేదని ధ్వజమెత్తారు. కనీసం కేసీఆర్ ఒక్కసారైనా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించలేదని దుయ్యబట్టారు. గడిచిన 9 సంవత్సరాలుగా ఉద్యోగాల భర్తీ విషయంలో పదే పదే మోసం చేస్తూనే ఉన్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రంలో 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని బిస్వాల్ కమిటీ నివేదిక స్పష్టంగా పేర్కొందని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. సునీల్ నాయక్, భాషా లాంటి వందలాది యువత నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర సర్కార్ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ జంగ్ సైరన్‌ల పేరుతో పోరాటాలు చేసినా.. పట్టించుకోలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు.
ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు రూ. 3,106 భృతి ఇస్తానని హామీ పచ్చి మోసం చేసిన కేసీఆర్.. ఉద్యోగాల భర్తీలో కూడా మోసం చేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. పేపర్ల లీకేజీ స్కాంలో బాధ్యులైన ఏ ఒక్కరినీ వదలకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీని (TSPSC) ప్రక్షాళన చేస్తారని.. సంస్కరిస్తారనే నమ్మకం, విశ్వాసం తెలంగాణ యువత, నిరుద్యోగులకు లేదని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
యువత, నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఒక భరోసా కల్పించాలని భావిస్తోందన్న రేవంత్.. తెలంగాణ విద్యార్ధులు, యువత నిరాశపడొద్దని పిలుపునిచ్చారు. మూడు నెలల్లో తమ ప్రభుత్వం వస్తుందని చెప్పారు. ఇప్పటికే యువ డిక్లరేషన్ ప్రకటించామని గుర్తు చేశారు. తెలంగాణలో న్యాయంగా ఉద్యోగ నియామకాలు జరగాలంటే.. కేసీఆర్ సర్కార్‌ను సాగనంపి.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక మార్గమని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.