Revanth Reddy comments on MLA Etala: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించాలన్న లక్ష్యంతోనే ఈటల బీజేపీలో చేరారని, ఆ పార్టీ, కేసీఆర్ ఒక్కటే అన్న విషయం ఆయన మాటల్లోనే స్పష్టమైందని వ్యాఖ్యానించారు. బీజేపీలో కూడా కేసీఆర్ కోవర్టులు ఉన్నారని, ఈటల పార్టీలో చేరిన తర్వాతనే ఆయనకు అర్థమైందన్నారు. ఇప్పుడు ఆయన లక్ష్యసాధన కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ మేరకు మీడియాతో ఇష్టాగోష్టిగా రేవంత్ మాట్లాడారు.
అందుకే బీజేపీకి ఓట్లు పడ్డాయి: సీఎం కేసీఆర్‌కు ఆది నుంచి అంబేడ్కర్ మీద గౌరవం లేదని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ పుట్టిన రోజు కాకుండా, అంబేడ్కర్ పుట్టిన రోజు సచివాలయాన్ని ప్రారంభిస్తే గౌరవం ఉండేదని అభిప్రాయపడ్డారు. ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు.. బీజేపీ సిద్ధాంతాలను విశ్వసించరని పేర్కొన్నారు.
బీజేపీ ఐడియాలజీతో ఈ ముగ్గురికి సంబంధం లేదన్న రేవంత్.. కేవలం కేసీఆర్‌ను మాత్రమే వ్యతిరేకిస్తారన్నారు. బీజేపీలో కూడా కోవర్టులు ఉన్నారని ఈటల అన్నారంటే, ఆయన ఏదో అసంతృప్తిగా ఉన్నట్లే కాదా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈటల రాజేందర్ ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక సతమతమవుతున్నారని చెప్పారు. హుజూరాబాద్, మునుగోడులలో రెండు చోట్ల కూడా సందర్భానుసారమే బీజేపీకి ఓట్లు పడ్డాయన్నారు.
మిగతా సందర్భాల్లో ఆ ఓట్లు కూడా పడేవి కావని వ్యాఖ్యానించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారని, హైకమాండ్ ఆ బాధ్యతలు ఆయనకు అప్పగించిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మరింత కఠినతరం చేయనున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పుడు వయో పరిమితి 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గిస్తామని వెల్లడించారు. 21 ఏళ్లకే కలెక్టర్ అయ్యేందుకు అవకాశం కల్పించినప్పుడు.. ఎమ్మెల్యే అయితే తప్పేముందని రేవంత్ అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ తన వ్యవహార శైలి మార్చుకోవాలి: సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రిపబ్లిక్ డేను ప్రగతిభవన్, రాజ్‌భవన్‌కే పరిమితం చేశారని మండిపడ్డారు. గణతంత్ర వేడుకను వివాదాలకు వేదిక చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్, సీఎం మధ్య విభేదాలుంటే మరో వేదికపై ప్రదర్శించాలి కానీ, గణతంత్ర వేడుకను వేదిక చేసుకోవడం సరికాదని హితవు పలికారు. సీఎం కేసీఆర్ తన వ్యవహార శైలి మార్చుకోవాలని సూచించారు. సీఎం వెంటనే గవర్నర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: