Revanth Reddy on Bharat Jodo Yatra : తెలంగాణ సమాజానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎనిమిదేళ్లుగా భాజపా చేతిలో భారతదేశం, తెరాస చేతిలో తెలంగాణ బందీగా ఉందని అన్నారు. భావ స్వేచ్ఛ కాదు కదా బతికే స్వేచ్ఛ కూడా కరువైందని లేఖలో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. రాహుల్‌తో కలిసి ప్రతి ఒక్కరు కనీసం ఒక్క కిలోమీటరైనా నడవాలని కోరారు. మంగళవారం రోజున హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద యాత్రలో పాల్గొనాలని విన్నవించారు. రేపు సాయంత్రం 5 గంటలకు నెక్లెస్ రోడ్డు వద్ద నిర్వహించనున్న సభకు అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు.
"22 కోట్ల మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారు. నిత్యావసరాలు, చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ప్రశ్నిస్తే దేశద్రోహం అని భాజపా అంటోంది. రాష్ట్రంలో కేసీఆర్.. దేశంలో మోదీ పాలనకు తేడా లేదు. రైతులు, యువతకు ఇచ్చిన హామీలను కేసీఆర్ గాలికి వదిలేశారు. హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ ఘనత." అని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.