Revanth Reddy Fires On TRS and BJP: టీఆర్ఎస్, బీజేపీ లేని వివాదాలు సృష్టించి.. రాష్ట్రంలో ప్రజాసమస్యలు పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ధరణి ఇబ్బందులు, పోడు సమస్యలు.. మాఫీ కానీ రుణాలు, పంట కొనుగోళ్లు జరగక రైతులు అవస్థలు వర్ణణాతీతంగా మారాయని అన్నారు. ప్రజాసమస్యలపై డిసెంబర్ 5 వరకు విడతల వారీగా ఆందోళనలకు సిద్ధమైన కాంగ్రెస్.. వివిధ అంశాలతో సీఎస్ సోమేశ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేసింది.
అంతకుముందు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క.. నేతలు నాగం జనార్దన్‌రెడ్డి, అజారుద్దీన్, కోదండరెడ్డి, బలరాంనాయక్ సీఎల్పీ కార్యాలయంలో భేటీ అయ్యారు. అక్కడి నుంచి బీఆర్కే భవన్‌కు వెళ్లిన పీసీసీ బృందం సీఎస్ సోమేశ్ కుమార్‌తో భేటీ అయింది. అనంతరం ప్రజాసమస్యలపై సీఎస్‌కు వినతిపత్రం అందజేశారు. ధరణి పోర్టల్ రైతుల పాలిట గుదిబండలా మారిందన్న రేవంత్‌రెడ్డి.. ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పినా ఇప్పటికీ పూర్తికాలేదన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పంతాలు.. వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం మోదీ-కేసీఆర్ పట్టింపులతో రాష్ట్రం నష్టపోతుందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనతోనే తెలంగాణ ప్రశాంతంగా ఉంటుందన్న రేవంత్.. తమ ఉద్యమంలో అందరూ కలిసిరావాలని కోరారు.
"కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ప్రమాదంలో పడ్డాయి. ధరణితో రైతుల పొట్టకొడుతున్నారు. బ్యాంకుల వద్ద రుణమాఫీ బకాయిలు చెల్లించలేక రైతులు డిఫాల్టర్స్‌గా మారారు. వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పోడు రైతుల సమస్యలను పరిష్కరించి వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే సమస్యలు తొలగిపోతాయని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కానీ రెండు రాజకీయ పార్టీలకు చెందిన ఇద్దరు వ్యక్తులు.. లేని వివాదాలను సృష్టించి రాష్ట్రాన్ని అస్థిరపరుస్తున్నాయి. లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని చూపి సమస్యలు రాకుండా చూస్తున్నారు. అందుకే మేము ప్రజాసమస్యలపై పోరాడుతున్నాం." - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఇవీ చదవండి: ప్రజా సమస్యలపై పోరాటానికి కాంగ్రెస్ సన్నద్ధం
1999 తుపాను సమయంలో మిస్సింగ్.. 23 ఏళ్ల తర్వాత ఇంటికి చేరిన వృద్ధుడు