Revanth Reddy fire on high electricity bill collections: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొమ్మిదేళ్ల పాలనలో అసమర్థ పాలన, అప్పుల భారం, ఆర్థిక సంక్షోభం తప్ప రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్తో దోస్తీ చేస్తున్న వామపక్షాలు.. పేదలపై పడుతున్న భారాన్ని నిలువరించే ప్రయత్నం చేయాలని సూచించారు. లేకుంటే కేసీఆర్ పాపంలో వారు కూడా భాగస్వాములవుతారని హెచ్చరించారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాసిన ఆయన.. విద్యుత్ విషయంలో ఏసీడీ పేరుతో వేస్తోన్న అదనపు భారాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా వ్యాపారాల నిర్వహణకు పోలీసు లైసెన్స్ తప్పనిసరి నిబంధనను సైతం తక్షణం ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించని పక్షంలో ప్రజలు, వ్యాపారుల పక్షాన కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుంటుందని తెలిపారు. లేని పక్షంలో చరిత్రలో నిలిచిపోయే బషీర్బాగ్ లాంటి ఘటనలు మన కళ్ల ముందే ఉంటాయని లేఖలో పేర్కొన్నారు.
'పేద, మధ్యతరగతి వారిపై దోపిడీకి తెగబడటం సరికాదు': కేసీఆర్ కుటంబ అవినీతి, కమీషన్ల కక్కుర్తితో ప్రభుత్వ సంస్థలు దివాలా తీశాయని ఆరోపించిన ఆయన.. ప్రభుత్వ అసమర్థతను, వ్యవస్థల పతనాన్ని కప్పిపుచుకోవడానికి విద్యుత్ ఏసీడీ ఛార్జీల పేరుతో ప్రజల నెత్తిన అదనపు భారం మోపుతున్నారని మండిపడ్డారు. ఒక వైపు కరోనా మరోవైపు పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ధరలు, నిత్యావసరాల పెరుగుదలతో ప్రజలు అల్లాడుతుండగా.. మరో వైపు ఉపాధి కరవై, ఉద్యోగాలు పోయి యువత రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
'విద్యుత్ సంస్థలు రూ. 60 వేల కోట్ల నష్టాల్లోకి ఎందుకు వెళ్లాయి'?: ఈ పరిస్థితుల్లో విద్యుత్ డిపాజిట్ల పేరుతో ప్రభుత్వమే పేద, మధ్యతరగతి వాడిపై దోపిడీకి తెగబడటం సరికాదని రేవంత్ దుయ్యబట్టారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 24 గంటలు కరెంటు ఇస్తున్నామని, విద్యుత్ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించామని ఊరు వాడ డప్పు కొట్టుకుంటున్న కేసీఆర్.. అదే నిజమైతే విద్యుత్ సంస్థలు రూ. 60 వేల కోట్ల నష్టాల్లోకి ఎందుకు వెళ్లాయని ప్రశ్నించారు. ప్రభుత్వం రూ. 20వేల కోట్ల మేర బకాయి పడిన మాట వాస్తవం కాదా అని పేర్కొన్నారు.
ఛత్తీస్గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం లోపభూయిష్టమని ఆరోపించిన రేవంత్.. దాని వల్ల తెలంగాణ ప్రజలపై భారం పడుతుందని నిపుణులు హెచ్చరించినా పెడచెవిన పెట్టారని లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారం వచ్చాక సొంతంగా నిర్మించి ప్రారంభించి పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు కూడా లేదని విమర్శించారు.
ఇవీ చదవండి: