ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐ విచారణకు అప్పగించిన సందర్భంగా కాంగ్రెస్ నుంచి వినతి పత్రం ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వెల్లడించారు. గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కాంగ్రెస్ ఇంప్లీడ్ పిటిషన్ వేయాలా? వద్దా? అనే దానిపై చర్చ జరుగుతుందోని వివరించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు టీఆర్‌ఎస్‌లో మంచి పదవులు ఇచ్చారని.. ఇది కూడా కరప్షన్ కిందకే వస్తుందని రేవంత్ స్పష్టం చేశారు.
అందుకే 2018 నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేల దగ్గర నుంచి విచారణ జరగాలని డిమాండ్ చేశారు. దీనిపై సీబీఐకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారిన వారేనని స్పష్టం చేశారు. ఆ కేసును రెండు కోణాల్లో చూడాలన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ రెండు బాధితులుగా చూపిస్తున్నారని.. మరి ఆ కేసులో దోషి ఎవరని ఆయన ప్రశ్నించారు. అసలు విచారణ పద్దతి అదికాదని సూచించారు.
నేరం జరిగింది.. కానీ విచారణ మేమే చేస్తామనడం ద్వారా టీఆర్‌ఎస్ లోపం బయటపడిందని రేవంత్ దుయ్యబట్టారు. నేరమే జరగలేదని అంటూనే సీబీఐ విచారణ అడగడం ద్వారా బీజేపీ లోపం బయటపడిందని ఆరోపించారు. సీబీఐ విచారణ అనగానే బీజేపీ, సిట్ విచారణ అనగానే టీఆర్‌ఎస్ ఎందుకు సంకలు గుద్దుకుంటున్నారని ప్రశ్నించారు. రాజకీయ అవసరాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని మండిపడ్డారు.
ఇవీ చదవండి: