Revanth Reddy Fires On CM KCR : దశాబ్ది దగా నిరసనలు తెలువుతున్న కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గమని.. బీఆర్‌ఎస్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పోలీసులతో కేసీఆర్ రాజ్యాన్ని నడపాలనుకుంటున్నారని విమర్శించారు. హజ్ యాత్రికులను పంపడానికి వెళుతున్న షబ్బీర్ అలీని గృహ నిర్బంధం చేయడం దుర్మార్గమైన చర్యని ఆక్షేపించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ అమరుల స్మారకం చూడగానే వారి పోరాటాలు, త్యాగాలను గుర్తు చేయాలని.. కానీ రాజకీయ స్వార్థం కోసం వారి త్యాగాలను కేసీఆర్ వాడుకున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చరిత్రనే తెలంగాణ చరిత్ర అన్నట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తొలి తెలంగాణ ఉద్యమంలో 369 మంది.. మలి దశలో 1200 మంది అమరులయ్యారని 2014 జూన్ 14 అసెంబ్లీ సమావేశంలో కేసీఆరే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. కానీ నేడు మలి దశలో 1200 మంది ఎక్కడ అమరులయ్యారని ఒక మంత్రి మాట్లాడటం చాలా బాధాకరమైన విషయమన్నారు.
Telangana Martyrs Memorial In Hyderabad : తెలంగాణ అమరుల స్మారక నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రూ.80 కోట్ల అగ్రిమెంట్‌ను రూ.179.5 కోట్లకు పెంచారని విమర్మించారు. ఇంత ఖర్చు చేసిన శిలాఫలకంపై అమరవీరుల పేర్లను పెట్టలేనప్పుడు.. రాష్ట్రంలో శిలాఫలకాలపై సీఎం కేసీఆర్ పేరును ఎలా రాయించాలని ధ్వజమెత్తారు. చరిత్రను మలినం చేయడానికే కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని.. దీన్ని తెలంగాణ సమాజం గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. అమరుల స్మారక నిర్మాణాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చారని విమర్శలు గుప్పించారు. ఇది తెలంగాణ సమాజాన్ని వెక్కిరించడం కాదా? ఇది బరితెగింపు కాదా అని మండిపడ్డారు.
Revanth Reddy Comments On Telangana Martyrs Memorial : అమరుల స్మారకం అంటే శ్రీకాంతాచారి, ఇషాన్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్ణయ్య వంటి వందలాది మంది గుర్తొచ్చేలా ఉండాలని రేవంత్‌రెడ్డి సూచించారు. దీని నిర్మాణంలో నాణ్యతాలోపం ఉందని ఆరోపించారు. తొమ్మిదేళ్లు అయినా ప్రభుత్వానికి అమరుల వివరాలు దొరకలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 1569 మంది అమరుల పేర్లను శిలాఫలకంపై పొందుపరిచి.. వారి కుటుంబాలకు నెలకు రూ.25 వేలు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేడ్కర్ విగ్రహం, అమరుల స్మారకం, సచివాలయ నిర్మాణాలపై విజిలెన్స్‌తో విచారణ చేయిస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి :