రాష్ట్ర స్థాయిలో వివిధ మత్స్య కార సంఘాలు, గంగపుత్ర, ముదిరాజ్ కుల సంఘాల నాయకులు హైదరాబాద్లోని మత్స్య శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయం మత్స్య భవన్ ముందు శాంతియుతంగా 'కఠోర దీక్ష' నిర్వహించారు. మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పోలీసు బలగాలను తమపై ప్రయోగించి దుర్మార్గంగా అరెస్టులు చేయించారని సంఘం ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ మండిపడ్డారు. మత్స్య సహకార సొసైటీ అకౌంట్లలో నగదు జమ చేసి, మంత్రి తలసాని టెండర్ల స్కాంలో తన హస్తం లేదని నిరూపించుకోవాలని ఆయన సవాల్ చేశారు.
రూ. వేల కోట్ల విలువైన మత్స్య సంపదను.. మంత్రి తన ఛాంబర్లోనే మత్స్యకారులకు వ్యతిరేకంగా టెండర్ల ద్వారా దళారీలకు అప్పజెప్పడాన్ని మత్స్య కార్మిక సంఘాలన్ని ముక్తకంఠంతో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని ఆయన వివరించారు. మత్స్య సొసైటీలకు చేపపిల్లల పంపిణీ కోసం నిర్వహించే ఈ టెండర్లలో భారీ అవినీతి జరుగుతోందని వారు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి టెండర్లు రద్దు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని మత్స్యకార సంఘం అధ్యక్షుడు సాయిలు బెస్త హెచ్చరించారు.
ఇదీ చదవండి: మహానగరంలో కరోనా మహమ్మారి విజృంభణ..!