కోట్లాది మందికి వినోదాన్ని పంచుతున్న తెలుగు టెలివిజన్ రంగాన్ని తెలంగాణ ప్రభుత్వం విస్మరించదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ రంగంలో అర్హులైన ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డులతో పాటు రేషన్ కార్డులను అందించనున్నట్లు ఈటల భరోసా ఇచ్చారు. తెలుగు టెలివిజన్ ఆవిర్భవించి 50 ఏళ్లవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లోని సత్యసాయి నిగమాగమంలో ప్రథమ నివేదన సభను ఏర్పాటు చేశారు. టీవీ రంగానికి సంబంధించిన 22 యూనియన్ల కార్మికులు పెద్ద సంఖ్యలో ఈ సభకు హాజరయ్యారు. ఫెడరేషన్ అధ్యక్షుడు నాగబాల సురేష్ అధ్యక్షతన జరిగిన సభకు మంత్రి ఈటలతోపాటు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, ప్రముఖ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలుగు టెలివిజన్ వర్కర్స్ ఫెడరేషన్ టీవీ కార్మికులు కష్టాలను ప్రభుత్వానికి నివేదించారు.
సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా..
టెలివిజన్ కార్మిక సంఘాల నివేదనపై స్పందించిన మంత్రి ఈటల.... టెలివిజన్ రంగాన్ని ప్రభుత్వం ఎప్పుడూ చిన్నచూపుగా చూడటం లేదన్నారు. టెలివిజన్ రంగంలోని కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే టీవీ నగర్‌తో పాటు పేదల తరహాలోనే రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే రసమయి టెలివిజన్ కళాకారులతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తెలుగు టెలివిజన్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పక్షాన మంత్రి ఈటల రాజేందర్ హామీతో కార్మిక సంఘాలన్నీ హర్షం వ్యక్తం చేశాయి.
ఇదీ చదవండి: రంగుల జీవితం వెనుక ఎన్నో కష్టాలు: మంత్రి ఈటల