KCR Announcement Regular Scale Of VRAs : వీఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడం ద్వారా వారికి రెగ్యులర్ స్కేల్ వచ్చేలా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లోపు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్న అనంతరం వీఆర్ఏ ఐకాస ప్రతినిధులతో సీఎం చర్చలు జరిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసేదే పేద ప్రజల కోసమన్న కేసీఆర్.. చిరుద్యోగులైన వీఆర్ఏల సమస్యలను మానవత్వంతో వెంటనే పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు పేర్కొన్నారు. సుమారు 20 వేల మంది వీఆర్ఏల్లో ముందు మెడికల్ ఇన్ వ్యాలిడేషన్ ప్రకారం అర్హులై దరఖాస్తు చేసుకున్న వారి వారసుల వివరాలు, విద్యార్హతలు సేకరించాలని అధికారులకు సూచించారు.
విద్యార్హతల ప్రకారం వారికి నచ్చిన శాఖలు : మిగతా వారిని వారి అర్హతల ఆధారంగా పురపాలక, నీటిపారుదల, రెవెన్యూ, జిల్లా పరిషత్, విద్యాశాఖ, వైద్యకళాశాలలు, మిషన్ భగీరథ తదితర అవసరమైన చోట వేతనస్కేలు ఇస్తూ సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తదుపరి పదోన్నతలు కూడా వచ్చేలా చూడాలని చెప్పారు. వీఆర్ఏలు సమాచారం ఇవ్వడంతో పాటు అన్ని విషయాల్లో సమన్వయం చేయాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డికి సూచించారు.
మొత్తం సమాచారాన్ని అధికారులకు అందించాలని వీఆర్ఏ ఐకాస నేతలకు సీఎం కేసీఆర్ సూచించారు. వీఆర్ఏలలో వారి విద్యార్హతలను ప్రకారం వారికి నచ్చిన ప్రభుత్వ శాఖలను ఎంచుకునే అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొని తమ సమస్యల తక్షణ పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు వీఆర్ఏ ఐకాస ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపిన వీఆర్ఏలు : వీఆర్ఏలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవడం సంతోషకరమన్న వీఆర్ఏ సంఘాలు.. రేపు అన్ని మండల కేంద్రాల్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయనున్నట్లు తెలిపాయి. రాష్ట్రంలో ఉన్న 23 వేల మంది వీఆర్ఏలను క్రమబద్దీకరిస్తామని 2017 ఫిబ్రవరి 27న ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. 80 రోజుల పాటు ఆందోళన తర్వాత మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు విరమించినట్లు నేతలు గుర్తు చేశారు. కొత్త సచివాలయంలో మొదటగా తమ సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావడం సంతోషకరమని, అది కూడా తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా శుభవార్త చెప్పారని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి వీఆర్ఏ కుటుంబం సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటుందని సంఘం నేతలు చెప్పారు.
ఇవీ చదవండి :