కరోనా వ్యాప్తి నేపథ్యంలో పట్టణాల్లో వాణిజ్య సంస్థలు, కర్మాగారాలు మూతపడటం, నిర్మాణరంగం కుదేలవడం, చిన్న వ్యాపారాలూ సాగకపోవడంతో వాటిపై ఆధారపడిన ప్రజలంతా గ్రామాల బాట పట్టారు.
సొంత ఊళ్ళకు చేరుకున్న వారిలో ఎక్కువ మంది బతుకుదెరువు కోసం ఉపాధిహామీ పనుల వైపు మొగ్గు చూపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ అంటే నాలుగు నెలల్లోనే కొత్తగా 2,47,440 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
జులై నెలాఖరు నాటికి 12.56 కోట్ల పనిదినాలు లక్ష్యంగా పెట్టుకోగా ప్రస్తుతానికి 9.55 కోట్ల పనిదినాలను పూర్తిచేశారు. అంటే నిర్దేశిత లక్ష్యంలో 76.01 శాతం సాధించినట్లయింది. సంబంధిత అధికారులు దీన్ని ఒక రికార్డుగా పేర్కొంటున్నారు. నిరుడు ఇదే సమయానికి నిర్దేశిత లక్ష్యంలో 27.36 శాతం పనిదినాలే పూర్తిచేయగలిగారు.
ఉన్నత విద్యావంతులు సైతం..
కరోనా కంటే ముందువరకూ గ్రామాల్లో నిరుపేద కూలీలు మాత్రమే ఉపాధి హామీ పనులపై ఆధారపడేవారు. మహమ్మారి నేపథ్యంలో ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది.
చదువుకున్నవారు సైతం పనుల కోసం వరుస కడుతున్నారు. వీరిలో పీజీ, డిగ్రీలు పూర్తిచేసిన ఉన్నత విద్యావంతులు సైతం ఉంటున్నారు. ఉపాధి పనుల కోసం నమోదు చేసుకుంటున్నవారి సంఖ్య భారీగా పెరగడానికి ఇది కూడా ఒక కారణమని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతుండటంతో గత ఏడాది కంటే ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ముందే మొదలైంది. సాగు పనుల కోసం వ్యవసాయ కూలీలకు డిమాండు ఉన్నప్పటికీ ఉపాధి హామీ పనులు కూడా బాగానే జరుగుతున్నాయని వారు వెల్లడించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,554 కరోనా కేసులు.. 9 మంది మృతి