Expert Advice On How To Get Rid Of Doom Scrolling: ఈ రోజుల్లో ఎవరిని చూసినా మొబైల్‌లోనే లీనమైపోతున్నారు. వ్యక్తిగత పనులనీ, ఆఫీస్ బాధ్యతలనీ, టైంపాస్ కోసమనీ.. అంతర్జాలంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాతో పాటు ఎన్నో వెబ్‌సైట్స్‌ని ఆశ్రయిస్తుంటాం. అందులో మనకు ఉపయోగపడే సమాచారమే కాదు.. మనకు అవసరం లేని వార్తలు, అవాస్తవమైన విషయాలూ మన కంట పడుతుంటాయి. వాటిని పట్టించుకోకుండా వదిలేస్తామా అంటే.. వాటి గురించే మరింత లోతుగా అన్వేషిస్తుంటాం. దీన్నే ‘డూమ్ స్క్రోలింగ్’ అంటారు. అయితే ఇది దీర్ఘకాలంలో ఎన్నో మానసిక సమస్యల్ని తెచ్చి పెడుతుందంటున్నారు నిపుణులు.
![](https://assets.eenadu.net/article_img/Doomscrolling650-2.jpg)
ఇలా మనసును కుంగదీస్తాయ్:
- అవాస్తవమైన వార్తలు, మరణాలు, హింస.. వంటి చెడు వార్తలు మన కంట పడినప్పుడు మనసులో ఒక రకమైన ఆందోళన మొదలవుతుంది. అలాంటి సంఘటనలు మన జీవితంలోనూ జరుగుతాయేమోనన్న ఆలోచనలు మనల్ని మరింతగా కుంగదీస్తాయి.
- చెడు వార్తలు అప్పుడప్పుడూ మన ఓపికకు పరీక్ష పెడుతుంటాయి. వీటి గురించి మరింత లోతుగా అన్వేషించే క్రమంలో ఓపిక నశించి కోపం ఆవహిస్తుంది. తన కోపమే తన శత్రువు అన్నట్లు ఇదీ మన మానసిక ఆరోగ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తుంది.
- అప్పటికే మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఇలాంటి చెడు వార్తల గురించి లోతుగా విశ్లేషించే క్రమంలో మరింత టెన్షన్ పడతారు. దీనివల్ల ఉన్నట్లుండి చెమటలు రావడం, శ్వాస అందకపోవడం, గుండె దడ పెరగడం.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవీ శారీరక, మానసిక ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు.
- చాలామంది నిద్ర పోయే ముందు ఇలాంటి ప్రతికూల వార్తల గురించి వెతుకుతుంటారు. లోతుకు వెళ్లే కొద్దీ ఇంకా తెలుసుకోవాలన్న ఆసక్తిని రేకెత్తించే ఈ ఆతృత వల్ల అటు నిద్రకు అంతరాయం కలుగుతుంది.. ఇటు శరీరంలో ఒత్తిడి హార్మోన్ స్థాయులు పెరిగి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇదిలాగే కొనసాగితే.. నిద్ర సమయాలకు భంగం కలిగి ఆరోగ్యమూ పాడవుతుంది.
- సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో కొన్ని అవాస్తవ సంఘటనలు/సమాచారం కూడా ఉంటుంది. కొన్ని వెబ్‌సైట్లు కూడా నిజానిజాలు తెలుసుకోకుండా వాటిని అలాగే పోస్ట్ చేస్తుంటాయి. పదే పదే కంట పడే ఇలాంటి సమాచారం కూడా మనల్ని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది. కాబట్టి మీకు సందేహం ఉన్న వార్తల గురించి వెతికే క్రమంలో కొన్ని ప్రామాణిక వెబ్‌సైట్లను ఫాలో అవడం మంచిది.
- ఎక్కువసేపు మొబైల్‌తో గడుపుతూ స్క్రోల్ చేయడం వల్ల కలిగే ఒత్తిడి, ఆందోళనలు.. ఆకలి హరించివేస్తాయని, స్వీయ ప్రేరణను దెబ్బతీస్తాయని ఓ అధ్యయనంలో తేలింది.
ఈ అలవాట్లతో ఫలితం:
![](https://assets.eenadu.net/article_img/Doomscrolling650-1.jpg)
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే జాగ్రత్తపడడం మంచిది కదా! డూమ్ స్క్రోలింగ్ తెచ్చే అనర్థాల విషయంలోనూ ఇది వర్తిస్తుందంటున్నారు నిపుణులు. దీని ప్రభావం మానసిక ఆరోగ్యంపై పడకుండా ఉండాలంటే ఈ అలవాట్లు తప్పనిసరి అంటున్నారు.
- మన రోజువారీ లైఫ్‌స్టైల్‌లో ప్రతిదానికీ ఒక టైమర్ సెట్ చేసుకునే మనం.. మొబైల్, ఆన్‌లైన్.. విషయంలో మాత్రం ఈ నియమం పెట్టుకోం. ఖాళీ దొరికినప్పుడల్లా మొబైల్‌తోనే కాలక్షేపం చేస్తుంటాం. కానీ ఈ విషయంలోనూ ఒక కచ్చితమైన టైమ్ టేబుల్ తప్పనిసరి. దాన్ని బట్టే ఓ అరగంటో, గంటో సోషల్ మీడియా, ఇతర ప్రామాణిక వెబ్‌సైట్లకు సమయం కేటాయించడం మంచిది.
- ఫోన్ కోసం రోజంతా సమయం కేటాయించలేకపోయినా.. రాత్రుళ్లు మొబైల్‌కు పని చెప్తుంటారు చాలామంది. ఈ అలవాటుకు స్వస్తి చెప్పాలంటే.. మొబైల్‌ను పడకగది బయటే వదిలి వెళ్లమంటున్నారు నిపుణులు.
- కాలక్షేపం కోసం మొబైల్‌ను ఆశ్రయించే వారు.. అందుకు ప్రత్యామ్నాయ మార్గాల్ని వెతుక్కోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో భాగస్వామి, పిల్లలు, స్నేహితులతో సమయం గడపడం.. అభిరుచులపై దృష్టి పెట్టడం, కాసేపు అలా ప్రకృతితో మమేకమవడం, యోగా-ధ్యానం-వ్యాయామాలకు సమయం కేటాయించడం.. ఇలా ఆలోచిస్తే బోలెడు మార్గాలున్నాయి.
- అనవసరమైన సమాచారం కోసం వెతుకులాడకుండా.. కెరీర్‌కు ఉపయోగపడే సమాచారం వెతకడం, మానసిక ప్రశాంతతను అందించే సరదా విషయాలు/పోస్టులు, స్ఫూర్తిదాయక కథలు.. వంటివి చదివితే మరీ మంచిది.
- సమాచారం తెలుసుకోవడమే కాదు.. మీకు తెలిసిన మంచి విషయాలను, ఇతరుల్లో స్ఫూర్తి నింపే కొటేషన్స్.. వంటివీ పోస్ట్ చేయచ్చు. దీని ద్వారా అనవసరమైన విషయాల పైకి మనసు మళ్లకుండా ఉంటుంది.
ఇవీ చదవండి: