అన్ని వర్గాల ప్రజల జేబులు గుల్ల చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చిందని స్థిరాస్తి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు నారాగోని ప్రవీణ్ అన్నారు. ఎల్ఆర్ఎస్ లేని భూములను రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ అంశంపై హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఎల్ఆర్ఎస్ రద్దు చేసే వరకు ప్రజా సంఘాల మద్దతుతో ఉద్యమాన్ని కొనసాగిస్తామని కార్యనిర్వాహక అధ్యక్షులు ఎం.నరసయ్య స్పష్టం చేశారు. ఈనెల 20 నుంచి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను కలిసి మద్దతు కోరడం, 21న గవర్నర్, సీఎంకు పోస్ట్ కార్డులు పంపడం, 22న భిక్షాటన, 24న వంటావార్పు, 26 ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు, 28న కలెక్టరేట్ల ముట్టడి, 29 హైవేల దిగ్భంధం, జనవరి 2 నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఎదుట రిలే నిరాహారదీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం దిగిరాకపోతే రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిస్తామని వెల్లడించారు.