గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించి.... అక్కడ మిగిలిన నీటిని సీమ ప్రాజెక్టులకు కేటాయించాలంటూ గ్రేటర్ రాయలసీమ నేతల, మాజీ అధికారులు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్కు లేఖ రాశారు. శ్రీశైలం జలాశయాన్ని గోదావరి జలాలతో ఎత్తిపోతల ద్వారా నింపాలన్న ప్రతిపాదనపై ఆంధ్ర - తెలంగాణ ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాలను మళ్లించడం వల్ల ఆదా అయిన కృష్ణా నీటిని... రాయలసీమ ప్రాజెక్టులు కేటాయింపులు చేసి చట్టబద్ధత కల్పించాలని గతంలో లేఖ రాసినట్లు పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రకటనపై హర్షం...
రాయలసీమ ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకోమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనపై ఏపీ ముఖ్యమంత్రి జగనే చొరవ తీసుకొని గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులైన హంద్రీనీవా, గాలేరు, నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేస్తూ చట్టబద్ధత కల్పించాలన్నారు.
గోదావరి జలాలను మళ్లించాలి
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు అపరిష్కృతంగా ఉన్నాయన్న నేతలు.. ఆ తీర్పు గ్రేటర్ రాయలసీమ మెడమీద కత్తి లాంటిదన్నారు. తెలుగు గంగకు 25 టీఎంసీలు నీటిని మాత్రమే కేటాయించారని... హంద్రీనీవా, గాలేరు, నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు చుక్కనీరు కూడా కేటాయించలేదన్నారు. తీర్పు అమల్లోకి వస్తే ఈ ప్రాజెక్టులన్నీ నిరర్ధక ఆస్తులుగా మిగిలిపోతాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ముందున్న ప్రత్యామ్నాయం గోదావరి జలాలు మళ్లించడమేనని....పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టుల ద్వారా ఆదా అయ్యే నీటిని... గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించటం తప్ప మరో దారి లేదన్నారు.
ఇదీ చదవండి: బిడ్డ పెళ్లి లొల్లి.. తెగిన తల్లి తాళి!