ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. పురపాలక ఎన్నికల పోలింగ్ సందర్భంగా నిన్న కొల్లు రవీంద్ర, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఓటు వేసేందుకు వెళ్లిన తన పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారన్న కారణంతో మచిలీపట్నం జలాల్‌పేటలోని పోలింగ్ కేంద్రం వద్ద రవీంద్ర బైఠాయించి నిరసన తెలిపారు. ఓటు వేసేందుకు వచ్చిన కొల్లుకు, వైకాపా ఏజెంట్లకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇనగుదురుపేట సీఐ శ్రీనివాసరావు కొల్లును వెళ్లిపోవాలని సూచించటంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది.
ప్రజాస్వామ్యంపై గౌరవంతో వ్యవహరిస్తున్న తమను చంపేయాలనుకుంటున్నారా అని కొల్లు రవీంద్ర పోలీసులపై వ్యాఖ్యాలు చేశారు. గెలుపు కోసం ఎన్నడూ లేని విష సంస్కృతికి పేర్ని నాని శ్రీకారం చుట్టారని విమర్శించారు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగంపై ఉదయాన్నే కొల్లు రవీంద్ర నివాసానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న తెదేపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. కొల్లు రవీంద్ర అరెస్టు సమయంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అరెస్టులకు భయపడేది లేదని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. అక్రమాలపై ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని నిలదీశారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఇదేం న్యాయమని అడిగితే తనపైనే కేసు పెట్టారని ఆక్షేపించారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని తేల్చి చెప్పారు.
కొల్లు రవీంద్రను అరెస్టు చేసిన పోలీసులు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. ఆయన వద్ద నుంచి రక్త నమూనాలు సేకరించారు. కొల్లు రవీంద్రపై 356, 506, 188 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కొల్లు రవీంద్ర అరెస్టు విషయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని న్యాయమూర్తి అభిప్రాయపడినట్లు.. న్యాయవాది విష్ణుతేజ తెలిపారు. కేసు విచారణకు పోలీసులకు సహకరించాలని న్యాయస్థానం ఆదేశించినట్లుగా తెలిపారు. న్యాయస్థానం కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు చేసింది.
కొల్లు రవీంద్ర అరెస్టును తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఖండించారు. ‘సీఎం జగన్ బీసీ వ్యతిరేకి అని ఆయన మండిపడ్డారు. బీసీలను పండుగ రోజు కూడా సంతోషంగా ఉండనీయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లు వేసుకున్న వైకాపా నేతలపై ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. వైకాపా ప్రభుత్వంలో బీసీలపై దౌర్జన్యాలు పతాకస్థాయికి చేరాయని ధ్వజమెత్తారు. గూండాయిజాన్ని ఎదిరించినందుకే బీసీలపై కక్షకట్టారా అని నిలదీశారు. కొల్లు రవీంద్ర చేసిన నేరమేంటని ప్రశ్నించారు.
రాష్ట్ర వ్యాప్తంగా బెదిరింపులకు దిగిన వైకాపా నాయకులను ఎంతమందిని అరెస్టు చేశారో సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బీసీలు వైకాపాకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. జిల్లా ఆసుపత్రిలో కొల్లు రవీంద్రను పరామర్శించిన మాజీఎంపీ కొణకళ్ల నారాయణ... ఆయన అరెస్టును తీవ్రంగా ఖండించారు. తెదేపాలో బీసీ నేతలను తప్పుడు కేసులతో వేధిస్తున్నారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రవీంద్ర అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. అరెస్టులతో బెదిరించాలని చూస్తే మరింత పోరాడతామన్నారు. రవీంద్ర అరెస్టు బీసీలపై కక్ష సాధింపులకు నిదర్శనమని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో బీసీల అరెస్టులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. కొల్లురవీంద్రపై తరచూ కక్షసాధింపు చర్యలు దుర్మార్గమని తెదేపా సీనియర్ నేత కళా వెంకట్రావు అన్నారు.
వైకాపా అక్రమాలను ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా..? అని ఆపార్టీ నేత చినరాజప్ప ప్రశ్నించారు. కొల్లురవీంద్ర అరెస్టు ప్రభుత్వ దుర్మార్గపు చర్యగి మాజీమంత్రి దేవినేని ఉమ అభివర్ణించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలపై కక్ష సాధిస్తోందని మాజీమంత్రి ఆలపాటి రాజా ధ్వజమెత్తారు. జగన్ బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతున్నారని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బెయిల్‌పై విడుదలైన కొల్లు రవీంద్రను పార్టీ ముఖ్యనేతలు పరామర్శించారు.
ఇదీ చదవండి: నాగ్‌పుర్‌లో మళ్లీ లాక్డౌన్- త్వరలో పుణెలోనూ!