అన్నదాతలందరికి రైతు బంధు సాయం అందించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. సాయం అందని వారికి ఏ కారణాల వల్ల ఇవ్వలేదో వెల్లడించాలని సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్ చేశారు. రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... హైదరాబాద్ బషీర్ బాగ్ లోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఒకటో విడతలో వచ్చి రెండో విడతలో డబ్బులు రాని రైతులు సాయం కోసం ఆశతో ఎదురుచూస్తున్నారని... తెలిపారు.
రైతు బంధు అందకపోవటం వల్ల... పంటల పెట్టుబడి కోసం అధిక వడ్డీలకు ప్రైవేటు రుణాలు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారన్నారు. నియంత్రిత వ్యవసాయం చేసిన వారికే రైతు బంధు అని ప్రభుత్వం ప్రకటించటం సరికాదన్నారు. జిల్లాల్లో రైతులను చైతన్యవంతం చేసి, భూసారం, నీటి వసతిని బట్టి పంటలను వేసేలా చూడాలని కోరారు. సకాలంలో రైతులందరికీ నాణ్యమైన విత్తనాలు, అవసరమైన ఎరువులను సరఫరా చేయాలన్నారు. నకిలీ విత్తనాలను అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.