ప్రభుత్వం ప్రతిపక్షాలపై పెట్టే కేసులకు భయపడమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ తేల్చి చెప్పారు. సీఎం రిలీఫ్ ఫండ్ నిధులపై ప్రజలకు లెక్కలు చెప్పాలన్నారు. హైదరాబాద్ మగ్దూం భవన్‌లో అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు. రమణతోపాటు తెజస అధ్యక్షుడు కోదండరామ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి హాజరయ్యారు.
ఆరోగ్య మంత్రి ఈటల మాటలను బట్టి ప్రభుత్వం 250 కోట్లు కేటాయిస్తే ప్రజలకు ఉచితంగా కరోనా వైద్యం అందించవచ్చునని కోదండరామ్ అన్నారు. సచివాలయం కట్టడానికి 400 కోట్లు పెడితే ప్రజల ఆరోగ్యం కోసం 250 కోట్లు కేటాయించలేరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా పెరగటానికి ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. ఉచితంగా కరోనా వైద్యం అందించే వరకు ప్రభుత్వంపై పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. తెలంగాణలో కరోనా టెస్టులు చేయకపోవడంపై జాతీయ స్థాయి చర్చ జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. కరోనాపై ముఖ్యమంత్రి కనీసం సమీక్ష చేయకపోవడం బాధ్యతారాహిత్యమన్నారు.
ఇదీ చూడండి : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 10,080 కరోనా కేసులు నమోదు