రాఖీ అంటే రక్షాబంధనం. అన్నాచెల్లెళ్ల ప్రేమ బంధం. సోదర ప్రేమకు సంకేతం. అక్కాచెల్లెళ్లు సోదరుల చేతికి రాఖీ కట్టి పది కాలాలపాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటారు. తమ సుఖాన్నీ, సంతోషాన్నీ కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకు ఆత్మీయత ఉంటుంది. ఆమెను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడటానికి సిద్ధంగా ఉంటారు. అనుబంధం, ఆసరా, అండ - ఇవేగా జీవితంలో కావల్సింది. కానీ ఎంతమంది ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. ఎంతమంది తోబుట్టువులకు అండగా నిలుస్తున్నారు.
రక్షాబంధన్ అంటే... కేవలం మీరు మీ తోబుట్టువులకు అండగా నిలవడమే కాదు...వారు జీవితంలో సాధించాలనుకున్నదానికి అడ్డుపడకుండా ఉండటం కూడా. ప్రతి అమ్మాయి తన జీవితంలో ఏదో సాధించాలనుకుంటుంది. కానీ... పెళ్లికి ముందు తల్లిదండ్రులు, తర్వాత భర్త చెప్పినట్లు నడుచుకోవడంతోనే సరిపోతోంది. కలలు కలలుగానే మిగిలిపోతాయి.
మీ జీవితంలో తారసపడే ప్రతి అమ్మాయి ఏదో ఒక దశలో తాను చేయాలనుకున్నది చేయలేని పరిస్థితులు ఎదుర్కొని ఉండవచ్చు. ఈ రక్షాబంధన్‌కు మీరు ఒక ప్రమాణం చేయండి. మీకు ధైర్యం చెబుతూ నిత్యం మిమ్మల్ని కంటికిరెప్పలా చూసుకుంటూ మీ జీవితంలో అండగా నిలుస్తున్న ఆడవాళ్లకు మీరు అడ్డుకాకుండా చూసుకోండి. వారి కలలకు మీ వంతు సహకారం అందించండి.
ఆశయాల కోసం ఆకాశానికి ఎగరాలనుకుంటే రెక్కలుగా మారి వారికి ఆసరాగా నిలుస్తామని భరోసా కల్పించండి. అలసిపోయినప్పుడు... సేదతీరుస్తామనే నమ్మకం కల్పించండి. ఇది కేవలం మీ తోబుట్టువుల వద్దే ఆగకూడదు. మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ఆడపిల్ల.. మీ భార్య, కూతురు, సహోద్యోగి ఇలా ప్రతి మహిళకు తాను అనుకున్నది సాధించే దిశలో దిక్సూచిలా మారండి కానీ అడ్డంకిగా కాదు.
రక్షాబంధన్ అంటే తోబుట్టువులకు అండగా ఉండటమే కాదు వారు సాధించాలనుకున్న వాటికి అడ్డుతగలకుండా ఉండటం కూడా అని నిరూపించండి.
ఇదీ చూడండి: విత్తన బంధం ఈ రక్షా బంధనం