రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్, కేంద్ర ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ పేర్లతో ఓటరు గుర్తింపు కార్డుల వ్యవహారంలో సీసీఎస్ పోలీసులకు సరైన ఆధారాలు లభించడం లేదు. వారి పేరుతో ఎందుకోసం దరఖాస్తు చేశారన్న అంశంపై విచారిస్తున్న పోలీసులు అయోమయంలో పడ్డారు. కార్డుల జారీలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం అధికారుల నిర్లక్ష్యం ఉందంటూ పోలీసులు కోర్టులో అభియోగపత్రాలు సమర్పించనున్నారు.
గుర్తింపుకార్డుల్లో చిరునామా ఆధారంగా విచారించిన అధికారులు
రజత్ కుమార్, ఓపీ రావత్ పేర్లతో ఓటరు గుర్తింపుకార్డులు జారీ అయ్యాయని జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం అధికారులు మూడు నెలల క్రితం సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరి ఓటరు గుర్తింపు కార్డుల్లోని చిరునామా ఆధారంగా మెహదీపట్నం చాచా నెహ్రూ పార్కు సమీపంలోని ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో ఉంటున్న వారిని ప్రశ్నించగా...తమకేమీ తెలియదని 20 ఏళ్లగా అదే ఇంట్లో ఉంటున్నామని వారు సమాధానం చెప్పారు.
తడబడుతున్న ఐటీ అధికారులు
జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్ ద్వారా ఎవరు దరఖాస్తు చేసుకున్నారో చెప్పాలని కోరగా, ఐటీ విభాగం అధికారులు తడబడుతున్నారు. దరఖాస్తులు ఎక్కడ నుంచి వచ్చాయనేది తెలిస్తే విచారణ వేగవంతమవుతుందని చెప్పినప్పటికీ, వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడటంలేదని పోలీసులు చెబుతున్నారు. సాంకేతిక అంశాలు, మరింత సమాచారం ఐటీ విభాగం అధికారులు ఇవ్వకపోవడంతో చట్టపరంగా వారిపై చర్యలు చేపట్టారు. ఈ మేరకు కోర్టులో అభియోగపత్రాలు సమర్పించాలని నిర్ణయించారు.
ఇవీ చూడండి: త్వరలో తెరాస శాసనసభాపక్ష సమావేశం