రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,601 రైతువేదికల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో గ్రామీణ క్లస్టర్లలో 2,536 కాగా... పట్టణప్రాంతాల్లో 65 నిర్మించింది. వ్యవసాయశాఖతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి ఉపాధిహామీ పథకం నిధులతో రైతువేదికలను నిర్మించారు. మొత్తం 2,601లో ఇప్పటి వరకు 1,877 రైతువేదికలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
673 రూఫ్ లెవల్ వరకు పూర్తి కాగా... 35 లెంటల్ వరకు, మిగిలిన 16 బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయి. వాటి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది. 72శాతానికి పైగా రైతువేదికలు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. ఇప్పటికే కొడకండ్లలో రైతువేదికను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్ర వ్యాప్తంగానూ ప్రారంభాలు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రైతువేదికల ప్రారంభోత్సవాలు చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాల వారీగా రైతువేదికల ప్రారంభోత్సవాలను చేపట్టనున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం