రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ గ్రామీణ జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఉత్తర ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని.. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఇది ఎత్తుకి వెళ్లే కొద్ది నైరుతి దిశవైపునకు వంపు తిరిగి ఉందని తెలిపింది.
రాగల రెండు రోజుల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని వెల్లడించింది. తదుపరి ఈశాన్య దిశగా ఉత్తరప్రదేశ్ వైపుగా ప్రయాణించే అవకాశం ఉందని చెప్పింది. బుధ, గురువారాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.