రాష్ట్రంలో వడగండ్ల వర్షం కడగండ్లు మిగిల్చింది. చాలా చోట్ల మామిడి, వరి పంటలు నీట మునిగాయి. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం రైతన్నలను అతలాకుతలం చేసింది. జనగామ జిల్లాలో మామిడి, వరి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురు గాలులకు పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. దేవరుప్పుల మండలం గోప్యానాయక్‌తండాలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ విరిగిపడింది.
వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పరిధిలో అకాల వర్షానికి వరి, మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు నీటిపాలయ్యాయి. సంగెం, పర్వతగిరి, రాయపర్తి మండలాల్లో వడగండ్ల వర్షం రైతులను నట్టేట ముంచింది.
మంత్రి ఎర్రబెల్లి సమీక్ష..
కుమురం భీం జిల్లాలో గాలి వాన బీభత్సానికి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. కాగజ్‌నగర్, కౌటాల, దహేగం, చింతలమానేపల్లి, సిర్పూర్ మండలాల్లో వడగండ్ల వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. కౌటాల మండలం ముత్యంపేటలో పలు ఇళ్లు ధ్వంసమై.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అకాల వర్షాలపై మంత్రి ఎర్రబెల్లి సమీక్షించారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి, పంట నష్టం అంచనా వేయాలని ఆదేశించారు.
రాజధానిలో..
హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురిసింది. పలుచోట్ల ఈదురుగాలులతో పాటు వడగళ్లు పడ్డాయి. ఎల్బీనగర్, హయత్‌నగర్, సికింద్రాబాద్, చంపాపేట్, పాతబస్తీ, దిల్‌సుఖ్‌నగర్, నాగోల్, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్, నాంపల్లి, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్ సీతాఫల్‌మండీలో వర్షం కారణంగా విద్యుత్ స్తంభంపై మంటలు చెలరేగాయి. విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదుచేసినా... చాలా సేపటివరకు ఎవరూ రాలేదు. అనంతరం విద్యుత్ సరఫరాను నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు.
సురారంలోని తెలుగు తల్లి నగర్‌లో డ్రైనేజీ పొంగి ఇళ్లలోకి మురికినీరు చేరింది. పీర్జాదిగూడలోని బుద్ధానగర్‌కాలనీలో రోడ్లు జలమయమవ్వగా.. ఓ మహిళ ప్రమాదవశాత్తు గోతిలో పడిపోయింది. సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. చౌటుప్పల్ సమీపంలో జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
రేపు, ఎల్లుండి కూడా..
పశ్చిమ విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇవీచూడండి: కరోనా కట్టడికి స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష: కేసీఆర్