కొవిడ్ కేసులు తగ్గుతుండటంతో రైల్వే శాఖ రోజువారీ నడుస్తున్న రైళ్ల సంఖ్యను క్రమంగా పెంచుతోంది. కరోనా కంటే ముందు తిరిగిన రైళ్లలో 56 శాతం రైళ్లు ప్రస్తుతం అన్ని జోన్ల పరిధిలో తిరుగుతున్నాయని ప్రకటించింది. ఇవాళ్టికి 983 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయని.. కొవిడ్‌కు ముందు సరాసరిగా రోజుకు 1768 రైళ్లు నడిచేవని అధికారులు వెల్లడించారు.
జూన్‌లో ఇప్పటి వరకు అన్ని జోన్ల పరిధిలో 660 కొత్త మెయిల్, ఎక్స్‌ప్రెస్, హాలిడే స్పెషల్ రైళ్లకు అనుమతి ఇచ్చినట్లు భారతీయ రైల్వే తెలిపింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెలలో 20 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 64 హాలిడే ప్రత్యేక రైళ్లకు అనుమతి ఇచ్చింది. స్థానిక పరిస్థితులు, టికెట్ డిమాండ్లు, కొవిడ్ కేసుల సంఖ్య ఆధారంగా కొత్త రైళ్లను ప్రారంభించాలని జోనల్ అధికారులకు సూచించింది.
కరోనా కారణంగా గతంలో చాలా వరకు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతున్న తరుణంలో దశలవారీగా రైళ్ల రాకపోకలు ఊపందుకుంటున్నాయి. కరోనా వేళ రాష్ట్రానికి కొన్ని వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను రైల్వే శాఖ పంపిణీ చేసింది. గతంలో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు గమ్య స్థానాలకు వేగంగా చేరుకునేలా రైల్వే శాఖ గ్రీన్ కారిడార్లను కూడా ఏర్పాటు చేసింది.
ఇదీ చదవండి: Niranjan Reddy: ఇకనైనా అక్రమ ప్రాజెక్టులను ఆపండి... లేకుంటే చూస్తూ ఊరుకోం