అఖిల భారత కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) వచ్చే నెల 17న తెలంగాణలో పర్యటించనున్నారు. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభల పేరుతో కాంగ్రెస్ నిర్వహించే ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు రాహుల్ పర్యటనపై క్లారిటీ ఇచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన, ఆత్మగౌరవ దండోరా సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈనెల 9న నిర్మల్ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను నిర్వహించింది. రెండో సభను నిన్న రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో చేపట్టింది. ఈ రెండు సభలు కూడా విజయవంతం కావడం వల్ల కాంగ్రెస్‌లో కొత్త జోష్ కనిపిస్తోంది.
ముగింపు సభ అంటే సెప్టెంబర్ 17న వరంగల్‌లో నిర్వహించే సభకు రాహుల్‌గాంధీని ఆహ్వానించినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ వస్తున్న నేపథ్యంలో వరంగల్ సభను భారీ ఎత్తున నిర్వహించేలా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.
ఇదీ చూడండి: Revanth: కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలకు రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం