Bharat Jodo Yatra in Bhagyanagaram: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్ర రాష్ట్రంలో ఉత్సాహంగా కొనసాగుతోంది. నిన్న హైదరాబాద్‌కు చేరుకున్న రాహుల్.. నెక్లెస్‌రోడ్డు వద్ద సభ అనంతరం బోయిన్‌పల్లిలోని గాంధీయన్ ఐడియాలజీ సెంటర్‌లో రాత్రి బస చేశారు. రాష్ట్రంలో ఎనిమిదో రోజు ఆరున్నరకు బాలానగర్ నుంచి జోడో యాత్ర ప్రారంభమైంది.
న్యూ బోయిన్ పల్లి, బాలానగర్ మెయిన్ రోడ్డు, సుమిత్రా నగర్ ఐడీపీఎల్ కాలనీ మీదుగా మదీనాగూడ చేరుకుంది. పాదయాత్ర సాగుతున్నంత సేపు రాహుల్ వెళ్తున్న మార్గాలన్నీ జనసంద్రంగా మారాయి. అభిమాన నేతను కాళ్లారా చూసేందుకు నగరవాసులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తరలిరాగా.. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాహుల్‌తో కదంకదుపుతున్నారు. బాలీవుడ్ నటి, దర్శకురాలు పూజాభట్ పాదయాత్రలో పాల్గొని.. రాహుల్‌కు మద్దతు తెలిపారు.
నిజాంపేట క్రాస్ వద్ద మహిళలు బోనాలతో తీసుకురాగా.. పోతురాజులు విన్యాసాలతో యాత్రకు స్వాగతం పలికారు. నిజాంపేట్ క్రాస్‌రోడ్డు వద్ద పిస్తాహౌజ్‌లో టీ తాగే సమయంలో రాహుల్‌గాంధీ కాసేపు విరామం తీసుకున్నారు. నిజాంపేట్ క్రాస్‌రోడ్డు నుంచి భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభం కాగా.. ఈ సమయంలో రాహుల్ ఆటో డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడుతూ యాత్ర సాగించారు.
ఆల్విన్ కూడలిలో జాతీయ పతాకంతో విద్యార్థులు అభిమాన నేతకు స్వాగతం పలికారు. జోడో యాత్ర కోసం సైబరాబాద్ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. బాలానగర్, మాదాపూర్ జోన్ల పరిధులకు చెందిన వెయ్యి మంది వరకు పోలీసులతో భద్రత పర్యవేక్షిస్తున్నారు. రాహుల్ యాత్ర కారణంగా నిజాంపేట్ నుంచి కూకట్‌పల్లి వరకు కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి.
ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసినప్పటికీ.. ప్రధాన రహదారి కావటంతో పెద్దఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. ఉదయం విరామం సమయానికి మదీనాగూడకు చేరుకున్న రాహుల్‌గాంధీ.. అక్కడి కిన్నెర గ్రాండ్ హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సాయంత్రం 4గంటలకు బీహెచ్ఈఎల్లో పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. సాయంత్రం మియాపూర్ లోని ఇందిరానగర్ కాలనీ, రామచంద్రాపురం, పటాన్‌చెరు, శాంతినగర్ మీదుగా ముత్తంగి వరకు సాగనుంది.
ఇవీ చదవండి: