Dubbaka MLA Raghunandan Comments : 'బీజేపీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వాలని.. మూడు పదవుల్లో ఏదో ఒక పదవి ఇవ్వాలని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అర్హుడిని కాదా' అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. పార్టీకి వ్యతిరేకంగా తాను మాట్లాడినట్లు మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు. పదేళ్లుగా క్రమశిక్షణ కలిగిన బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నానన్న ఆయన.. రెండోసారి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు.
అసత్య ఆరోపణలను ప్రసారం చేయవద్దని మీడియా ప్రతినిధులకు రఘనందన్ రావు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు బీజేపీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వాలని.. మూడు పదవుల్లో ఏదో ఒక పదవి ఇవ్వాలని రఘునందన్ రావు మాట్లాడినట్లు మీడియాలో ప్రసారం అయ్యింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అర్హుడిని కాదా అని.. ఫ్లోర్ లీడర్‌లో ఏదో ఒకటి ఇవ్వాలన్న ఆయన.. జాతీయ అధికార ప్రతినిధి ఇచ్చినా నాకు ఓకే అన్నట్లు రఘునందన్‌రావు చెప్పినట్లు ప్రసారం అయ్యాయి.
దుబ్బాకలో తనను చూసే ప్రజలు గెలిపించారన్న రఘునందన్... బండి సంజయ్‌ది స్వయంకృతాపరాదంగా అభివర్ణించినట్లు ప్రసారం అయ్యాయి. బండి సంజయ్ పదవి మార్పుపై వచ్చే వార్తలన్నీ నిజాలేనని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్ బొమ్మలతో ఓట్లు రావన్న ఆయన... రఘునందన్, ఈటల బొమ్మలతోనే ఓట్లు వస్తాయని వ్యాఖ్యానించినట్లు మీడియాలో ప్రసారమయ్యాయి.
తాను గెలిచినందుకే ఈటల రాజేందర్ పార్టీలోకి వచ్చారన్న రఘునందన్.. పదేళ్లలో పార్టీ కోసం నాకంటే ఎక్కువ ఎవరూ కష్టపడలేదన్నట్లు వార్తలు వచ్చాయి. సేవకు ప్రతిఫలం లేకుంటే నడ్డాపై మోదీకి ఫిర్యాదు చేస్తానని రఘునందన్ వెల్లడించినట్లు మీడియాలో ప్రసారం అయ్యాయి.
"మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి.. నేను పార్టీ అధిష్ఠానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు కొన్ని మీడియా ఛానళ్ల వారు వార్తలు వేశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను ఈరోజు ఎటువంటి ప్రెస్‌మీట్ గానీ.. చిట్‌చాట్ గానీ నిర్వహించలేదు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలవడానికి ఆయన ఆఫీస్ దగ్గరకు వచ్చాను. ఆ సమయంలో నేను కొందరు మీడియా మిత్రులతో అన్న మాటలు వారు తప్పుగా ప్రచారం చేశారు. గత పదేళ్లుగా బీజేపీ పార్టీకి విధేయుడిగా పని చేస్తున్నాను. ఎప్పుడూ నా వ్యక్తి గత ప్రయోజనాలను చూసుకోలేదు. దయచేసి ఇలాంటి వార్తలను ప్రచారం చేయకండి."- రఘునందన్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే
ఇవీ చదవండి: