Singareni Land Expatriates Protest: పెద్దపల్లి జిల్లా మంథని మండలం సింగరేణి భూనిర్వాసిత రచ్చపల్లి గ్రామ పంచాయతీలో మంగళవారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. రచ్చపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రచ్చపల్లి, అడ్రియాల గ్రామాల ప్రజలు.. ఓసీపీ 2 బొగ్గు ఉపరితలం నుంచి మట్టి వెలికితీసే కంపెనీ ఎన్సీసీ వాహనాలను అడ్డుకొని ధర్నా చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సింగరేణి అధికారులు ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సింగరేణి సంస్థ ఓసీపీ 2, అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు విస్తరణలో భాగంగా తమ గ్రామాలను తీసుకొని పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించలేదని భూ నిర్వాసితులు ఆరోపించారు. వేసవి కాలంలో రాత్రి పూట విద్యుత్ సరఫరా నిలిపివేసి నిరంకుశ విధానాలను అవలంబిస్తున్నారని.. బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామ సర్పంచ్ శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. నూతనంగా నిర్మించిన ఆర్అండ్ఆర్ కాలనీలో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించలేదని.. ఇంకా కొంతమందికి పరిహారం చెల్లించాల్సి ఉందని తెలిపారు.
ఉన్న ఊరు, ఇల్లు, భూములు త్యాగం చేస్తే కనీసం ఉపాధి సౌకర్యాలు కూడా కల్పించడం లేదని.. గ్రామానికి చెందిన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని భూనిర్వాసితులు డిమాండ్ చేశారు. సింగరేణి అధికారులకు, గ్రామస్థులకు మధ్య జరిగిన చర్చల్లో వారం రోజుల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు ధర్నాను విరమించారు. అనంతరం విలేకరులతో ఆర్జీ 3 మేనేజర్ అయిత మనోహర్ మాట్లాడారు.
ప్రజల రక్షణే తమ ధ్యేయమని అయిత మనోహర్ అన్నారు. రచ్చపల్లి గ్రామానికి సంబంధించి రెండేళ్ల క్రితమే ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి అన్ని సౌకర్యాలను, ప్యాకేజీని చట్ట ప్రకారం అందజేశామని చెప్పారు. ఇప్పుడు ఉద్యోగాలు కావాలని కోరుతున్నారని, వెంటనే రచ్చపల్లి గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని కోరారు. రచ్చపల్లి గ్రామం కిందే అండర్ గ్రౌండ్ మైనింగ్ పనులు నడుస్తున్నాయని తెలిపారు. మున్ముందు ఎలాంటి ప్రమాదం జరగకముందే గ్రామాన్ని ఖాళీ చేయాలని వారిని కోరినట్లు మనోహర్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: Land Expatriates Protest: 'మార్కెట్ ధర మేరకు పరిహారం చెల్లించాల్సిందే'