ముఖ్యమంత్రి కేసీఆర్ కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారే తప్ప.. ప్రజలు చదువుకుని అభివృద్ధి చెందే విషయంలో శ్రద్ధ చూపడం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 40 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలంటూ తెలంగాణా నిరుద్యోగ ఐకాస డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ లక్డీకాపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. నిరసనకు ఆర్.కృష్ణయ్య మద్దతు తెలిపారు.
రాష్ట్రం ఏర్పడితే ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి... ఆరేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని కృష్ణయ్య ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని అన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు.
లేనిపక్షంలో ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం టీచర్ పోస్టులు భర్తీ చేసి.. టెట్ నిర్వహించాలని కోరారు. ప్రజాప్రతినిధులు మారకుంటే ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో నిరుద్యోగులతో కలిసి నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని నిరుద్యోగ ఐకాస చైర్మన్ నీల వెంకటేష్ తెలిపారు.
ఇదీ చూడండి : ఏడో ఆర్థిక గణాంక సర్వే.. ఉపాధి అవకాశాలు