ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని.. టెట్ పరీక్ష నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా విద్యావ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. పక్క రాష్ట్రాల్లో ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష నిర్వహిస్తుంటే... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడేళ్లుగా నిర్వహించకుడా మాయమాటలతో కాలక్షేపం చేస్తోందని ఆరోపించారు. నిరుద్యోగులు తమ సమస్యల సాధనకై హైదరాబాద్ లక్డీకాపుల్లోని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాకు ఆయన సంఘీభాావం తెలిపారు.
ఏళ్ల తరబడి కాలయాపన
ప్రభుత్వ పాఠశాలల్లో 50 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 8792 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారు. వాటినికూడా భర్తీ చేయకుండా ఏళ్ల తరబడి కాలయాపన చేస్తోందని ఆరోపించారు. 7 లక్షల మంది బీఈడీ, డీఈడీ, పండిట్ శిక్షణ, పీఈటీ కోర్సులు చేసిన విద్యార్థులు నిరుద్యోగులుగా రోడ్లమీద తిరుగుతున్నారని... వెంటనే టెట్ నిర్వహించి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని... లేనిపక్షంలో నిరుద్యోగులను, విద్యార్థులను ఐక్యం చేసి ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇదీ చూడండ: బావను కత్తితో పొడిచిన బావమరుదులు