హరితహారంలో భాగంగా ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే హరితహారం కార్యక్రమంపై అధికారులతో సమీక్షించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జాతీయ రహదారులపై హైవే నర్సరీలు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్అండ్బీ ఆధీనంలోని నేషనల్ హైవేలపై 25 నర్సరీల స్థలాలు గుర్తించాలని... వాటికి హైవే నర్సరీలుగా నామకరణం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో 800 కిలోమీటర్ల మేర రోడ్లకిరువైపులా, సెంట్రల్ మీడియంలో ఈ సారి హరితహారం కార్యక్రమంలో 3,30,000 మొక్కలు నాటి, వాటిని సంరక్షించేందుకు పూర్తి బాధ్యత తీసుకుంటామని ఎన్హెచ్ఏఐ తెలంగాణ రీజినల్ అధికారి కృష్ణ ప్రసాద్ మంత్రికి వివరించారు. తమ శాఖ ఆధీనంలో ఉన్న 20 అతిథి గృహల్లో నర్సరీలు పెంచాలని అదేవిధంగా జిల్లా కలెక్టరేట్లలో నర్సరీలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. రోడ్లు, భవనాల శాఖ అధికారులు, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ హరితహారం కార్యక్రమం విజయవంతమయ్యే విధంగా చూడాలని తెలిపారు. ఆయా జిల్లాలో ఆర్అండ్బీఎస్ఈలు ఆ బాధ్యతను తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: నర్సాపూర్ ఉద్యానవనం ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి హరీశ్