రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే వాటి కేసుల నమోదుతో పాటు ప్రమాద వివరాలను సంబంధిత ట్రైబ్యునల్‌కు పంపి బాధితులకు సత్వరం పరిహారం అందించడానికి సీఐడీలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఐజీ నేతృత్వంలోని రాష్ట్ర నేర గణాంక విభాగం దీనిని పర్యవేక్షిస్తుందన్నారు. అన్ని జిల్లాల అధికారులు నెలవారీ నివేదికలను సీఐడీకి పంపాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. నెలకు ఎన్ని రోడ్డు ప్రమాదాలు జరిగాయి... ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ట్రైబ్యునల్‌కు యాక్సిడెంట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు పంపారన్న వివరాలను పట్టిక రూపంలో సమర్పించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఏఐఆర్లతో సహా మొత్తం వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తోందన్నారు.
హైకోర్టుకు డీజీపీ నివేదిక
క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్ సిస్టంను రూపొందిస్తున్నామని... ఇది అందుబాటులోకి వస్తే సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు అన్ని వివరాలను అప్లోడ్ చేస్తామని డీజీపీ తెలిపారు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 158 (6) అమలుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ట్రైబ్యునల్‌కు వివరాలు పంపితే బీమా కంపెనీ 30 రోజుల్లో బాధితులకు పరిహారం చెల్లించాల్సి ఉందని... ప్రమాదం వివరాలను పోలీసులు పంపకపోవడం వల్ల పరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతుండటంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ జరిపింది. ఇందులో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్. చౌహాన్, జస్టిల్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై మరోసారి విచారణ చేపట్టింది. గత ఆదేశాలతో డీజీపీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ హైకోర్టుకు అందజేశారు.
రాష్ట్రంలో అత్యధికంగా రాచకొండ పరిధిలో ప్రమాదాలు
నివేదిక ప్రకారం గత ఆరు నెలల్లో 10 వేల 423 కేసుల్లో ఏఐఆర్లను సమర్పించినట్లు చెప్పారు. మొత్తం 30 జిల్లాలకు సంబంధించి ఆరు నెలల్లో 10 వేల 423 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు వివరించారు. ఇందులో 3 వేల 795 మంది మృతి చెందగా... 10 వేల 980 మంది గాయపడినట్లు తెలిపారు. ప్రస్తుతం అన్ని కేసులకు సంబంధించిన ఏఐఆర్లను కేసు నమోదు అయిన 30 రోజుల్లోనే ట్రైబ్యునల్‌కు పంపామన్నారు. అత్యధికంగా రాచకొండ పరిధిలో 1545 ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 422 మంది మృతి చెందగా... 1448 గాయపడ్డారు. రెండో స్థానంలో సైబరాబాద్ పరిధిలో 1469 ప్రమాదాలు జరగ్గా, 444 మంది మృతి చెందారని, 1340 మంది గాయపడ్డారన్నారు. నివేదికను పరిశీలించిన ధర్మాసనం ప్రస్తుతం జీరో పెండెన్సీ చూపడం బాగుందని, తాము ఆదేశాలిచ్చేనాటికి ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయో చెప్పాలంది. ప్రభుత్వం రూపొందిస్తోన్న సీసీటీఎన్ఎస్ మంచి ప్రయత్నమని... అది ఎప్పటిలోగా వస్తుందో చెప్పాలంటూ విచారణను వాయిదా వేసింది.
ఇవీ చూడండి: అనిశాకే అడ్డంగా దొరికిన అనిశా కానిస్టేబుల్