టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో రేపు, ఎల్లుండి జరగాల్సిన పుప్పాలగూడ, ఖానామెట్ భూముల వేలం వాయిదా పడింది. కోర్టు కేసుల నేపథ్యంలో వేలాన్ని వాయిదా వేసినట్లు టీఎస్‌ఐఐసీ తెలిపింది. ఈ సందర్భంగా వివాదరహిత భూములనే తెలంగాణ ప్రభుత్వం వేలం వేస్తుందని ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పష్టం చేశారు. నిజాయతీ లేని కొందరు న్యాయస్థానాల్లో పనికిరాని కేసులు దాఖలు చేశారని మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అన్ని అంశాలను పరిష్కరించిన వెంటనే తిరిగి ఈ వేలం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కొనుగోలుదారులకు కలిగిన అసౌకర్యానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
హైకోర్టు బ్రేక్..
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలోని భూముల వేలానికి సంబంధించి టీఎస్‌ఐఐసీ జారీ చేసిన నోటిఫికేషన్‌లోని మరికొన్ని ప్లాట్ల వేలాన్ని నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తమ భూములను వేలం వేయడాన్ని సవాలు చేస్తూ రామచందర్‌సింగ్ మరో ఆరుగురు దాఖలు చేసిన పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. సర్వే నం.326, 327, 301, 303ల్లో ఉన్న 13, 14, 15, 24, 27, 30 ప్లాట్‌ల వేలాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నంబర్లలో కాందిశీకులకు చెందిన 18 ఎకరాల భూమి వివాదంలో ఉండగా.. ప్రభుత్వం వేలం వేయడం సరికాదంటూ వేలాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
ఇప్పటికే హెచ్‌ఎండీఏ పరిధిలోని ఖానామెట్ భూముల వేలం ప్రక్రియ జరిగింది. అక్కడున్న 14.91 ఎకరాలను 5 ప్లాట్లుగా విభజించి హెచ్‌ఎండీఏ ఆన్‌లైన్ వేలం నిర్వహించగా రూ.729.41 కోట్ల ఆదాయం సమకూరింది. భూముల వేలంలో ఎకరం సగటు ధర రూ.48.92 కోట్లు, గరిష్ఠంగా రూ.55 కోట్లు పలికింది. ఈ ప్రాంతంలో వాణిజ్యపరమైన సముదాయాలు, వినోదభరిత ప్రాంతాలు, రవాణా సౌకర్యం ఉండడంతో ఖానామెట్ భూములు అధిక ధర పలికాయి. భూములకు ఎలాంటి చిక్కులు లేవని, సింగిల్ విండో ద్వారా నిర్ణీత కాల వ్యవధిలో త్వరితగతిన అనుమతులు ఇస్తామని టీఎస్ఐఐసీ వేలం సందర్భంగా తెలిపింది.
సంబంధిత కథనాలు..
మళ్లీ షురూ... ప్రభుత్వ భూముల వేలానికి సర్కారు సన్నద్ధం!
Puppalaguda land auction: పుప్పాలగూడలో ఐదు ప్లాట్ల వేలంపై హైకోర్టు స్టే
Govt on Land Auction: 'భూముల వేలం పారదర్శకంగా జరిగింది.. నిరాధార ఆరోపణలు చేస్తే చర్యలు తప్పవు'
ముగిసిన ఖానామెట్ భూముల వేలం.. ఎకరాకు గరిష్ఠంగా రూ.55 కోట్లు