Bank employees strike: ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలో గురువారం బ్యాంకింగ్ వ్యవస్థ స్తంభించింది. బ్యాంకులు మూతపడ్డాయి. జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణను విరమించుకోవాలంటూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్(యూఎఫ్‌బీయూ) దేశవ్యాప్తంగా రెండు రోజులు సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్‌లోని కోఠి బ్యాంకుస్ట్రీట్‌లోని బ్యాంకుల ఆవరణలో ఉద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. నగరంలోని వివిధ బ్యాంకులకు చెందిన అధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరై బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
దుర్మార్గమైన ఆలోచన...
రాష్ట్రంలో వివిధ జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో బ్యాంకు ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించారు. బ్యాంకుల ప్రైవేటీకరణతో ఖాతాదారులకు తీవ్రనష్టం కలగడంతో పాటు వివిధ రంగాలకు బ్యాంకింగ్ తోడ్పాటుపై ప్రభావం పడుతుందని ఆరోపించారు. వ్యవసాయరంగం అభ్యున్నతికి, బలహీనవర్గాల సంక్షేమానికి, చిన్నమధ్యతరహా పరిశ్రమలు సహా అనేక రంగాలకు జాతీయ బ్యాంకులు తోడ్పాటును ఇస్తున్నాయని తెలిపారు. జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వ దుర్మార్గమైన ఆలోచన అని యూఎఫ్‌బీయూ రాష్ట్ర కన్వీనర్ బి.ఎస్.రాంబాబు మండిపడ్డారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా బ్యాంకుల ప్రైవేటీకరణ యోచనను కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ పోరాటం ఆగదని అవసరమైతే నిరవధిక సమ్మెకు వెనుకాడేదిలేదని ఏఐబీఈఏ కేంద్ర కమిటీ సభ్యులు హెచ్చరించారు.
ప్రైవేటీకరణ బిల్లును తెరాస అడ్డుకుంటుంది...
జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణ ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ ఆరోపించారు. జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణను తెరాస తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. పార్లమెంట్ ఉభయసభల్లో బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును తెరాస అడ్డుకుంటుందని ప్రకటించారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌లకు కొమ్ముకాస్తోందని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ మండిపడ్డారు. యూఎఫ్‌బీయూ కన్వీనర్ శ్రీరాం, ఫణికుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, హరినాథ్, పీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్ తదితరులు ప్రసంగించారు.
నిలిచిన రూ. 18,600 కోట్ల విలువైన చెక్కుల లావాదేవీలు...
ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఏడు లక్షల మంది సిబ్బంది సమ్మెకు దిగడంతో దేశంలో పలుచోట్ల బ్యాంకు సేవలకు అంతరాయం వాటిల్లింది. ఏటీఎంలు పనిచేయడం వల్ల కొన్ని సేవలు లభ్యమైనా, నేరుగా బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన పనులు స్తంభించిపోయాయి. రూ.18,600 కోట్ల విలువైన 20.4 లక్షల చెక్కుల లావాదేవీలు నిలిచిపోయాయని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సిహెచ్.వెంకటాచలం తెలిపారు. శుక్రవారం కూడా ఈ సమ్మె కొనసాగనుంది. గురువారం ప్రైవేటు బ్యాంకులు మాత్రం యథావిధిగా పనిచేశాయి.
ఇదీ చదవండి: DSP POST: మల్టీజోనల్ కేడర్ పోస్టుగా డీఎస్పీ.. రిక్రూట్‌మెంట్ వరకు మాత్రమే పరిమితం