కార్మిక, కర్షక నల్ల చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాడతామని ఏఐటీయూసీ స్పష్టం చేసింది. కేంద్రంలో భాజపా రెండోసారి అధికారంలోకి వచ్చాక తమ నిజస్వరూపాన్ని బయటపెడుతోందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి యం. నర్సింహ ఆరోపించారు. దేశ సంపదను దోచి బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు నూతన చట్టాలను రూపొందిస్తోందని ఆరోపించారు. గత 6 నెలలుగా రైతులు దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన నిర్వహిస్తున్నా పట్టించుకోకపోవటం కేంద్ర ప్రభుత్వానికి ప్రజలపై ఉన్న అభిప్రాయాన్ని తెలియజేస్తోందని విమర్శించారు. కార్మిక, కర్షక నల్లచట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలో భాగంగా హైదరాబాద్ హిమాయత్ నగర్లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయం వద్ద బుధవారం నల్లబ్యాడ్జీలు, నల్లబ్యానర్లతో ధర్నా చేప్టటారు.
మోదీ ప్రభుత్వం విఫలం
కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ గత 6 నెలలుగా రైతులు దిల్లీ సరిహద్దుల్లో వేలాదిగా ఆందోళనలు నిర్వహిస్తున్నా కేంద్రానికి కనువిప్పు కలగడం లేదని దుయ్యబట్టారు. దేశంలో తీవ్ర స్థాయిలో కరోనా పెరగటానికి కారణమైన మోదీ ప్రభుత్వం.. దేశ ప్రతిష్ఠను ప్రపంచ దేశాల ముందు తలదించుకునేలా చేసిందని విమర్శించారు. చట్టాలను రద్దు చేయని పక్షంలో ప్రజలందరూ తిరగబడేందుకు సిద్ధమవుతారని హెచ్చరించారు. అప్పటి వరకు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఉద్ఘాటించారు.
ఇదీ చదవండి: Baswapuram Reservoir: పనుల పురోగతిపై మంత్రి జగదీశ్ సమీక్ష