రాష్ట్రంలో గత యాసంగి మార్కెటింగ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా ముగిశాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఏప్రిల్ 1న ప్రారంభమైన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ... గన్నీ బ్యాగులు, లారీలు, రవాణా, గోదాములు, కూలీలు వంటి ఇబ్బందులు ఉత్పన్నమైనా అవన్నింటిని అధిగమించింది. 2019-20లో అత్యధికంగా రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి కావడం దేశం దృష్టిని తెలంగాణ ఆకర్షించింది.
వానాకాలం | 47 లక్షల మెట్రిక్ టన్నులు |
యాసంగి | 65 లక్షల మెట్రికి టన్నులు |
మొత్తం ఉత్పత్తి | 112 లక్షల మెట్రికి టన్నులు |
గత యాసంగిలో 6408 కొనుగోలు కేంద్రాల ద్వారా 9.68 లక్షల మంది రైతుల నుంచి దాదాపు రూ.12 వేల కోట్లు విలువ చేసే 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన పౌరసరఫరాల సంస్థ... 11 వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేసింది. మరో రెండు మూడు రోజుల్లో మిగిలిన మొత్తం జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
'రైస్ బౌల్ ఆఫ్ ఇండియా'గా తెలంగాణ
తెలంగాణ ఆవిర్భావ ఏడాది 2014-15లో 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన పౌరసరఫరాల సంస్థ... ఈ ఏడాది కోటి 12 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. కొత్త రాష్ట్రమైనా అతి కొద్ది సమయంలో తెలంగాణ 'రైస్ బౌల్ ఆఫ్ ఇండియా'గా అవతరించబోతోంది. ముందస్తు అంచనాలకు అనుగుణంగానే కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావడం ఓ శుభపరిణామం. ధాన్యం కొనుగోలుకు 18 కోట్ల గన్నీ సంచులు అవసరం కాగా లాక్‌డౌన్ మొదలైన మార్చి 24 నాటికి 9 కోట్ల గన్నీ సంచులు మాత్రమే సంస్థ వద్ద ఉన్నాయి. కోల్‌కతా నుంచి రావాల్సిన గన్నీసంచులు రాకపోయినా అదనంగా మరో 9 కోట్ల సంచులు సమకూర్చి రైతులకు ఇబ్బందులు లేకుండా చూసింది.
కరోనా కట్టడిలో సేవా కార్యక్రమాలు
మహమ్మారి కట్టడి, లాక్‌డౌన్ ఆంక్షల అమలు సమయంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు 1500 రూపాయల నగదు, ఉచిత రేషన్ బియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలు అమలు చేయాల్సి వచ్చింది. ఒకవైపు... దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు సేవ చేసే అవకాశం కల్పించిన క్రమంలో ధాన్యం కొనుగోళ్లు, మరోవైపు... ప్రజా పంపిణీ అమల్లో ఎలాంటి సమస్యలు రాకుండా విజయవంతం చేసిన అధికారులకు, సిబ్బందికి పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.