ఏపీ వ్యాప్తంగా 12 వేల ఆర్టీసీ బస్సులున్నాయి. అందులో సగందాకా పాతవే.! సాధారణంగా దూరప్రాంత బస్సులు, ఘాట్ రోడ్లలో తిరిగే బస్సులు.. 6లక్షల కిలోమీటర్లు తిరిగితే పక్కనపెట్టాలి. కానీ అధికారులు.. వాటిని ఆర్డినరీ సర్వీసులుగా మార్చి 10లక్షల కిలోమీటర్లు తిప్పుతుంటారు. అలా 10లక్షల కిలోమీటర్లు పూర్తైన పల్లెవెలుగు బస్సులే.. 4 వేల వరకూ ఉన్నాయి. కొన్నైతే 12, 13 లక్షల కిలోమీటర్లూ తిరిగాయి. ఎక్స్‌ప్రెస్,.. డీలక్స్ బస్సులూ అంతంతమాత్రమే.
దూరప్రాంతాలకు నడిచే సూపర్ లగ్జరీ బస్సుల నిర్వాహణా తీసికట్టుగా మారుతోంది. కొన్నిసీట్లు పుషింగ్ పనిచేయడం లేదు. కొన్ని అద్దాలు తెరచుకోవు. టీవీలు, ఛార్జింగ్ బాక్సులు.. పనిచేయవు. మురికి పట్టిన సీట్లు, విరిగిన హ్యాండిళ్లు, పనిచేయని టీవీలు.. ఇలాంటి అసౌకర్యాలే ప్రయాణికులకు దిక్కవుతున్నాయి. ఉన్నతాధికారులకు మొత్తుకోవడమేగానీ కొత్త బస్సులు రావడం లేదని బస్సు డ్రైవర్లు, కండక్టర్లు వాపోతున్నారు.
ఏపీఎస్ ఆర్టీసీకి ఆదాయం తప్ప ప్రయాణికుల అవస్థలు పట్టడంలేదు. సెస్సు రూపంలోనో.. మరో ఇతర మార్గాల్లోనే పిండుకుంటున్న ఆర్టీసీకి.. సౌకర్యాలు కల్పించడానికి చేతులు రావడం లేదు. గత మూడున్నరేళ్లలో రెండు సార్లు ఛార్జీలు పెంచింది. కిలోమీటర్ల ప్రాతిపదికన డీజిల్ సెస్ వడ్డించింది. కానీ మూడున్నరేళ్లుగా సంస్థలో అదనంగా కొన్న బస్సుల్లేవు. 12 లక్షల కిలోమీటర్లు తిరిగి కాలం చెల్లిన బస్సుల స్థానంలో ఏవో కొన్ని బస్సులను రీప్లేస్ చేశారే తప్ప, కొత్త సర్వీసులు రోడ్డెక్కించలేదు. పైనపటారం.. లోన లొటారం అన్నట్లు పల్లెవెలుగు సర్వీసులకు పైపై రంగులు వేసి నడిపిస్తున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయ్యాక ప్రగతి రథ చక్రాల ప్రతిష్ట మసకబారింది. జీతాలిస్తున్నపేరుతో ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ నుంచి నెలకు 125 కోట్ల రూపాయల ఆదాయం వెనక్కి తీసుకుంటోంది. కానీ సౌకర్యాలను పట్టించుకోవడంలేదు. గతంలో ఇచ్చినట్లుగా కొత్త బస్సులకు ఆర్థిక సాయం అందించడంలేదు.
క్షేమంగా గమ్యం చేరాలంటే ఆర్టీసీ బస్సెక్కండి,.. ఆర్టీసీ ప్రయాణం సుఖమయం.. ఇలాంటి స్లోగన్లతో ప్రయాణికుల్ని ఆకర్షించిన యాజమాన్యం.. ఇప్పుడు ప్రయాణికులకు ఏం చెప్తుంది.? రోడ్లు బాగోలేవని ప్రభుత్వంపై నెట్టేస్తుందా? కొత్త బస్సులు కొనడానికి.. సర్కారు సొమ్ములివ్వడం లేదని సాకు చెప్తుందా? ఇవన్నీ ఎందుకులే అని స్లోగన్లు మార్చేసుకుంటుందా? చూడాలి మరి..
APSRTC: ఇదేంటి బస్సును నడిరోడ్డులో ఆపారని అనుకుంటున్నారా..? నిజానికి ఎవరూ ఆపలేదు. అదే ఆగిపోయింది. కావాలంటే ఈ వైపు చూడండి. ఇదన్నమాట సంగతి. కోనసీమ జిల్లా, రాజోలు నుంచి అంతర్వేది బయల్దేరిన బస్సు.. మలికిపురం వచ్చేసరికి ఇదిగో ఇలా చతికిలపడింది. ముందు చక్రం విరిగి అలా నిలిచిపోయింది. ఒక్క కుదుపునకి ప్రయాణికులు బెంబేలెత్తారు.
ఈ బస్సుదీ అదే పరిస్థితి. ఏపీలోని అల్లూరి జిల్లా నర్సీపట్నం నుంచి రాజవొమ్మంగి వెళ్తుండగా ఇలా ఎడమవైపునుండే 2చక్రాలూ ఊడిపోయి బస్సు కొంత దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. ఓ చక్రం పొలాల్లోకి దొర్లుకుంటూ వెళ్లింది.
ఇక్కడ చూడండి. బస్సులో ఉండాల్సిన ప్రయాణికులు.. కిందకు దిగి తోస్తేగానీ కదలని పరిస్థితి. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు రైల్వే గేటు వద్ద.. ఈ బస్సు కింది భాగంలో జాయింట్ కట్ అయి ఆగిపోయింది. ట్రాఫిక్ ఆగిపోవడంతో ప్రయాణికులే.. ఇది బండికాదు మొండి అంటూ ఇలా చెమటోడ్చాల్సి వచ్చింది.
ఇక ఇదైతే అదృష్టమనే చెప్పాలి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి కర్నూలు వెళ్తున్న బస్సు స్టీరింగ్ రాడ్డు విరిగి రోడ్డు పక్కనున్న కల్వర్ట్‌నిఢీకొంది బస్సు చక్రాలు ఊడాయి. అదృష్టవశాత్తూ ప్రయాణికులు చిన్న గాయాలతో బయటపడ్డారు.
పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఇలాంటి దుర్ఘటనే తప్పింది. భీమవరం నుంచి అమలాపురం వెళ్తున్న బస్సు.. పి.గన్నవరం 3రహదారుల కూడలిలో బ్రేక్ ఫెయిలైంది. ఎదురుగా ఒక ప్రైవేటు స్కూల్ బస్సును తగులుకుని ఆగింది. లేదంటే జనం మీదకు దూసుకెళ్లి ఘోరం జరిగేది. పెడల్ బ్రేక్‌తోపాటు హ్యాండ్ బ్రేక్ కూడా ఫెయిలైందని డ్రైవర్ నవీన్ వాపోయారు.
ఇక ఇటీవలే విశాఖ నుంచి సాలూరు వెళ్తున్న అల్ట్రా డీలక్స్ బస్సులో జోరువానకు గొడుగులు వేసుకుని ప్రయాణించడం.. మన ఆర్టీసీ పరువును నెట్టింట్లో నిలబెట్టింది.
ఈ బస్సు చూడండి ఎలా భగభగామండిందో. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం పులవర్తిగూడెం వద్ద బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 40 మంది ప్రయాణికులు హుటాహుటిన కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. వేసవికాలంలో ఇంజిన్‌లో మంటలు వచ్చాయంటే ఎండవేడి అని సరిపెట్టుకోవచ్చు. కానీ వానాకాలంలో కూడా ఇంజిన్ మండిందంటే.. నిర్వహణా లోపానికి ఇంతకంటే పరాకాష్ట ఏముంటుంది.?
ఇలా వరుస దుర్ఘటనలు.. అసలు మన ఆర్టీసీకి ఏమైందనే ప్రశ్నల్ని సంధిస్తున్నాయి. ప్రమాదాలబారిన పడుతున్నావాటిలో ఎక్కువ శాతం పల్లె వెలుగు సర్వీసులే. చాలా బస్సుల్లో డ్రైవర్ ముందుండే మీటర్లు పనిచేయడం లేదు. ఎంత స్పీడ్ వెళ్తున్నామో తెలియదు. ఇంజిన్‌పై వేసే బానెట్లు.. క్లిప్పులు ఊడిపోయి ఏదో అలా పడి ఉన్నాయి. కొన్ని బస్సుల్లో కిటికీల్లేవ్,... కిటికీలుంటే అద్దాలు లేవు. అద్దాలుంటే సీట్లు సరిగా ఉండవు. బస్సులో వెళ్తున్నంత సేపూ ఒకటే రొద. పక్కవాళ్లు ఏం చెప్తున్నారో వినపడనంత శబ్దాలు వస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే ఆర్టీసీ యాజమాన్యం చోద్యం చూస్తోంది. సంస్థను విలీనం చేసేసుకున్న ప్రభుత్వం... సౌకర్యాలు గాలికొదిలేసింది. మూడేళ్లలో రెండుసార్లు ఛార్జీలు వడ్డించడమేగానీ. కనీస మరమ్మతులూ చేయించడం లేదు. అసలు రాష్ట్రంలో ఎన్ని డొక్కుబస్సులున్నాయి. మన ఆర్టీసీ ముఖచిత్రమేంటి?
ఇవీ చదవండి: