రాష్ట్రం ఏదైనా కానీ.. వాహనం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక దేశంలో ఏ మూలకైనా అందులో ప్రయాణించవచ్చు. లైసెన్స్, వాహనానికి సంబంధించిన పత్రాలు ఉంటే చాలు. ఇదే ఆలోచనతో వాహనాలతో పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్న తెలుగువారికి ఇబ్బందులు తప్పట్లేదు. వాహనాల నంబర్లు అసలువి కావని, నకిలీ పత్రాలతో వస్తున్నారంటూ పోలీసు, రవాణాశాఖ అధికారులు నిలిపివేస్తున్నారు. వాహనదారులు ఆధారాలు చూపినా సానుకూలంగా స్పందించట్లేదు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి ఉత్తర్‌ప్రదేశ్‌లోని పుణ్యక్షేత్రాలు చూసొద్దామని కుటుంబంతో కారులో బయల్దేరారు. అయోధ్య వద్ద తనిఖీల్లో ఆయన వాహనం నిలిపివేశారు. చివరికి 5-6 గంటల తర్వాత ఇక్కడి నుంచి రవాణాశాఖ అధికారులు స్పందించాక ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల తెలంగాణ నుంచి సరకుతో ఒక లారీ పంజాబ్ చేరింది. సరిహద్దుల వద్ద తనిఖీల్లో పత్రాలు సరైనవి కాదంటూ తిరకాసు పెట్టారు. జరిమానా చెల్లించాలంటూ ఒత్తిడి చేశారు. ఈ సంఘటనలు మచ్చుకు కొన్నే...
ఎందుకీ సమస్య?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ, ఏపీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్లు ఒకేలా ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీఎస్, ఏపీలో ఏపీ39తో కొత్త వాహనాలను రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ప్రతి రాష్ట్రంలోనూ రవాణాశాఖ వెబ్‌సైట్‌లో అక్కడి వాహనాల వివరాలు పొందుపరుస్తుంటారు. రాష్ట్రాలవారీగా వాహనాల సమాచారాన్ని కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించే ‘వాహన్’ వెబ్‌పోర్టల్‌కు అనుసంధానిస్తారు. తద్వారా వాటి వివరాలు తనిఖీ చేసే వెసులుబాటు రవాణా, పోలీసుశాఖలకు కల్పించారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయాక ఏపీలో జిల్లాలవారీగా కోడ్ నంబర్ల స్థానంలో ఒకే నంబరును కేటాయించారు. తెలంగాణలో ఆయా జిల్లాలకు టీఎస్ పక్కన నంబర్లను చేర్చుకునే వెసులుబాటు కల్పించారు. 2015 నుంచి కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ఇలాగే జరుగుతోంది.
ఇబ్బందికి నేపథ్యమిదీ...
పాతవి, 2015-20 వరకు రిజిస్ట్రేషన్ చేసిన వాహనాలకు సాంకేతిక సమస్యల కారణంగా ‘వాహన్’ వెబ్‌పోర్టల్‌తో అనుసంధానం జరగలేదు. ఫలితంగా తెలంగాణలోని పాత బండ్లను ఆంధ్రప్రదేశ్‌విగానే కొన్ని రాష్ట్రాలు పరిగణిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్ వాహనాల రిజిస్ట్రేషన్లకు గుర్తింపు లేదంటూ అక్కడి రవాణాశాఖ అధికారులు చెప్తున్నారు. వాహన్ వెబ్‌పోర్టల్‌లో మూడు రాష్ట్రాల వాహనాల నంబర్లను చేర్చకపోవడమే సమస్యకు మూలమని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాంకేతికంగా తలెత్తిన సమస్యను అధిగమించేందుకు కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తున్న వాహనాలను తక్షణమే వెబ్‌పోర్టల్‌కు అనుసంధానిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో తెలంగాణ వాహనదారులకు సాంకేతికంగా ఇలాంటి ఇబ్బంది ఎదురైతే.. తమ రాష్ట్ర రవాణాశాఖ అధికారులకు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం(ఎన్‌వోసీ) తీసుకోవచ్చని ఆయన సూచించారు.