ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చటంలో కీలక పాత్ర పోషించే ప్రైవేటు ట్రావెల్స్‌రంగం కరోనా కాటుకు కుదేలై... వాటిపై ఆధారపడిన వేలమంది కార్మికులు పస్తులుండే దుస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షా 25వేల టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. వైరస్ కట్టడికి మార్చిలో విధించిన లాక్‌డౌన్ నాటి నుంచి ఇప్పటి వరకు వీటి కింద పనిచేసే వాహనాలన్నీ షెడ్డులకే పరిమితమయ్యాయి. ప్రతి గ్యారేజ్‌లో 200ల నుంచి 300ల వరకు పార్కింగ్ చేశారు. వీటిపై ఆధారపడి పనిచేసే డ్రైవర్లు, క్లీనర్లు, ఇతర సిబ్బంది ఉపాధి కోల్పోగా... ట్రావెల్స్ నిర్వాహకులు ఉపాధిలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రజారవాణాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా... ట్రావెల్స్ వాహనాలు తిరిగే పరిస్థితి ఇంకా లేదు. హైదరాబాద్ పరిధిలోని ఐటీ సంస్థల కోసమే సుమారు లక్షా50 వేల టూర్స్ అండ్ ట్రావెల్స్ వాహనాలు నడుస్తుంటాయి. ప్రస్తుతం ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లకుండా ఇంటి నుంచే పనిచేస్తున్నందున... ఈ వాహనాలకు పనిలేకుండా పోయింది. టూరిజం కోసం మరో లక్షా 22వేల వాహనాలు గతంలో తిరుగుతుండేవి. పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు ఆసక్తి చూపకపోవడం వల్ల ఆ బస్సులు కూడా నడవడంలేదు.
దిక్కుతోచని స్థితిలో కార్మికులు
ట్రావెల్స్ వాహనాలపై ఆధారపడిన కార్మికులు ఉపాధి లేకపోవటంతో ఆర్నెళ్లుగా దిక్కుతోచని పరిస్థితిలో జీవనం సాగిస్తున్నారు. అప్పులు చేసి కొన్న వాటికి కిస్తీలు చెల్లించలేక, కార్మికులకు వేతనాలు ఇవ్వలేక ట్రావెల్స్ నిర్వాహకులు సతమతమవుతున్నారు. వాహనాలను పార్కింగ్ ప్రదేశాలకూ నెలల తరబడిగా అద్దెలు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. వీటితో పాటు క్వార్టర్లీ ట్యాక్స్‌ను కట్టాలని ఫైనాన్స్ సంస్థలు ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి..
నెలల తరబడిగా గ్యారేజ్‌లకే పరిమితమైన వాహనాలకు ట్యాక్స్‌లు చెల్లించటం తలకుమించిన భారంగా మారిందని.... ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చామని ట్రావెల్స్ నిర్వాహకులు చెబుతున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఆఫ్ రోడ్‌లో ఉన్న వాహనాలకు ట్యాక్స్‌ను మినహాయించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న 'ఉల్లి' ధరలు