విద్యాసంస్థల ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. జులైలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ లోపే ఎల్‌కేజీ, యూకేజీ మొదలుకొని అన్ని తరగతులను ఆన్‌లైన్‌లో యాజమాన్యాలు నిర్వహిస్తుండడం గమనార్హం.
బోధన సాగుతోందిలా..
- ఆన్‌లైన్ బోధనను ప్రైవేటు పాఠశాలలు జూమ్ యాప్, గూగుల్ మీట్స్, తమ సొంత వెబ్ లింకుల ద్వారా చేపడుతున్నాయి. కొందరు వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు. ఇవన్నీ ఫీజులు కడితేనే అనుమతిస్తామని షరతు పెడుతున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం ట్యూషన్ ఫీజులను నెలవారీ చెల్లించాలని ఆదేశించింది. ఈ పాఠశాలలు మాత్రం మూడు వాయిదాల్లో చెల్లించాలంటున్నాయి. విద్యార్థులు ట్యాబ్‌లు తీసుకోవాలని సూచిస్తున్నాయి. పిల్లలు పాఠాలు కోల్పోతారన్న భయంతో తల్లిదండ్రులు వాటిని కొనుగోలు చేయక తప్పడం లేదు. ఇద్దరు పిల్లలున్న వారు ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లు కొనాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికంగా కష్టమని వాపోతున్నారు.
- కొన్ని పాఠశాలలు 3-4 గంటలు బోధిస్తున్నాయి. మరికొన్నిచోట్ల ఉదయం 9-11వరకు, 10-12 వరకు రెండు సెషన్లలో తరగతులు నిర్వహిస్తున్నారు.
- సిగ్నల్ లేకపోవడం, మొబైల్ డాటా సరిగా లేక చాలామందికి బోధన పూర్తిగా అందడం లేదు.
షరతులు.. వసూళ్లు
- అమీర్‌పేటలోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఫీజు కడితేనే ఆన్‌లైన్‌లో బోధన లింకు పంపిస్తామని తల్లిదండ్రులకు సందేశాలు పంపింది. పాఠాలు వినాలంటే స్కూల్ డ్రెస్ వేసుకొని ఉండాలని షరతు విధించింది.
- సికింద్రాబాద్‌లోని మరో పాఠశాల ఆన్‌లైన్ తరగతి ముగించిన ప్రతిసారీ ఫీజులు కట్టాలని, లేకపోతే తరగతులు బంద్ అవుతాయని ఉపాధ్యాయులుతో చెప్పిస్తోంది.
- ఎల్బీనగర్‌లోని ఓ ప్రముఖ పాఠశాల పుస్తకాలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. డెలివరీ ఛార్జీలు తీసుకొని ఇంటికే పంపిస్తోంది. ఫీజులు చెల్లించాలని హుకుం జారీ చేస్తోంది. హైటెక్‌సిటీలోని రెండు ప్రముఖ పాఠశాలలదీ ఇదే పరిస్థితి. యాప్‌ల సాయంతో ఫీజులు కట్టాలని, పుస్తకాలు కొనాలని ఒత్తిడి తెస్తోంది.
- సికింద్రాబాద్, విద్యానగర్, అంబర్‌పేట, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ఖైరతాబాద్, బేగంపేట పరిధిలోని దాదాపు అన్ని పాఠశాలలు ఆన్‌లైన్ బోధన ప్రారంభించాయి.
- ఎలా పాఠాలు చెబుతామనే విషయంపై సికింద్రాబాద్‌లోని ఓ పాఠశాల తల్లిదండ్రులకు రెండున్నర గంటలపాటు తరగతులు నిర్వహించడం విశేషం.
సమాలోచనలు జరగాలి
పాఠశాలలు ప్రారంభించినా విద్యార్థులను పంపేందుకు చాలామంది తల్లిదండ్రులు సిద్ధంగా లేరు. ఫీజుల వసూళ్లు, పుస్తకాల విక్రయాల కోసం కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్ బోధన ఎత్తుగడ వేశాయి. విద్యాసంవత్సరం ప్రారంభించాలన్న ప్రభుత్వ ఆదేశాలు లేకుండానే తల్లిదండ్రులపై అదనపు భారం మోపుతున్నాయి. ఆన్‌లైన్ బోధన పేరిట ఫీజుల వసూళ్లను ఖండిస్తున్నాం. తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలకు ఇబ్బంది లేకుండా బోధన సాగించేలా సమాలోచనలు జరగాల్సిన అవసరం ఉంది.
- వెంకట్, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి