నారాయణ, శ్రీ చైతన్య, శ్రీ గాయత్రి కార్పొరేట్ కళాశాలల బోధన, బోధనేతర ఉద్యోగుల పట్ల ఆయా కళాశాలల యాజమాన్యాలు అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఈ కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగులను అక్రమంగా తొలగించడాన్ని నిరసిస్తూ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద భౌతిక దూరాన్ని పాటిస్తూ లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది తెలంగాణ లెక్చర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
కేవలం హైదరాబాద్‌లోనే ఆయా కళాశాలల్లో 5000 మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని రాష్ట్ర ప్రైవేటు కళాశాలల లెక్చరర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రావు తెలిపారు. అన్ని ప్రైవేటు సంస్థలు ఉద్యోగుల జీతాలు ఆపవద్దని సర్కారు ఆదేశించినప్పటికీ... ఏప్రిల్ , మే నెలలకు జీతం చెల్లించబోమని మేనేజ్‌మెంట్లు ప్రకటించాయని ఆయన విచారం వ్యక్తం చేశారు.
జీవో నంబర్ 45 ఉల్లంఘన...
రెండు రోజుల క్రితం కళాశాలల యాజమాన్యాలు జీవో నంబర్ 45ను ఉల్లంఘించి ఉద్యోగులందరినీ తొలగించారని ఆయన పేర్కొన్నారు. తొలగించిన ఉద్యోగులందరినీ వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉద్యోగులకు న్యాయం చేయాలని ఆయన అభ్యర్థించారు. తాము జ్ఞానాన్ని అందించడమే కాక, విద్యార్థులను వివిధ ప్రవేశ పరీక్షలకు సిద్ధం చేశామన్నారు. ఏళ్ల తరబడి ఇదే విధంగా కళాశాలల యాజమాన్యాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు.