Inter student committed suicide in Hanumakonda : తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. కాలేజీల్లో యాజమాన్యాల వేధింపులు, మార్కులు పేరుతో ఒత్తిడి, సరిగ్గా చదవడం లేదని తల్లిదండ్రులు మందలించడం వంటి కారణాలతో విద్యార్థులు క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ మనం చూడాల్సి వస్తోంది. తాజాగా ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది.
హనుమకొండలో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నాగజ్యోతి అనే అమ్మాయి ఇంటర్ చదువుతుంది. ఆమె వసతి గృహంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే గమనించిన కళశాల యాజమాన్యం... విద్యార్థిని నాగజ్యోతిని హుటా హుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. నాగజ్యోతి చికిత్స పొందుతూ.. ప్రాణాలు విడిచింది. మృతురాలు కొడకండ్ల మండాలనికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
అయితే ఇంటర్ పరీక్షలు ఇటీవల ప్రారంభం అయిన విషయం తెలిసిందే. నాగజ్యోతి నిన్న ఉదయం ఇంటర్ పరీక్ష రాసింది. అనంతరం ఆత్మహత్యకు పాల్పడటం అనేక సందేహాలకు దారితీస్తోంది. ఇంటర్ పరీక్ష సరిగ్గా రాయలేదనే మనస్థాపం గురైందా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ విషయంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నాగజ్యోతి పరీక్షల్లో బాగా రాయలేదని... ఫెయిల్ అవుతాననే మనస్తాపంతో డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇక మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఎంతో కష్టపడి పెంచుకున్న కుమార్తె కళ్ల ముందు విగత జీవిగా పడటంతో తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. పోస్టుమార్టం అనంతరం నాగజ్యోతి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. అయితే హనుమకొండలో విద్యార్థిని మృతికి విద్యార్థి సంఘాల ధర్నా నిరసన చేపట్టాయి. విద్యార్థిని మృతికి యాజమాన్యమే కారణమంటూ ఆందోళన చేపట్టాయి. విద్యాసంస్థలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశాయి.
ఇక ఇదీలా ఉంటే... హైదరాబాద్ నగరంలో కూడా మరో ఆత్మహత్య వెలుగు చూసింది. పేట్‌బషీరాబాద్ పరిధిలో బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఉరేసుకుని 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు 15 ఏళ్లు కూడా నిండని ఈ బాలుడు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడో కారణాలు ఇంకా తెలియరాలేదు. కళ్ల ముందే కన్న కొడుకు విగత జీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇక రాష్ట్రంలో ప్రతి చిన్నదానికి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఎన్ని విధాలుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టినా... నిత్యం ఏదో ఓ చోటా ఆత్మహత్య ఘటనలు వెలుగు చూస్తున్నాయి. విద్యాసంస్థలు కూడా దృష్టి పెట్టి... విద్యార్థులపై ఒత్తిడి తీసుకురాకుండా ఉంటే.. కాస్త ఆత్మహత్యలను అరికట్టవచ్చు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఆలోచనలపై దృష్టి సారించి.. వారికి ధైర్యాన్ని, అండగా ఉంటామన్న భరోసా ఇస్తే... ఆత్మహత్యలు కాస్త ఆపొచ్చు.
ఇవీ చదవండి:
'ఈడీని ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పి.. ఎందుకు సుప్రీంను ఆశ్రయించారు?'
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కాంగ్రెస్ పోరాడితే మేం మద్దతు ఇస్తాం: కవిత
మద్యం కేసుతో తనకు సంబంధం లేదన్న కవిత.. 16న మళ్లీ రావాలన్న ఈడీ