ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ఛైర్మన్, జీర్ణకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డికి అత్యంత ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సంస్థ ‘అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్సెస్(ఏఏఏఎస్)’లో స్థానం దక్కింది. నోబెల్ పురస్కార గ్రహీతలు, అంతర్జాతీయ ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలకు మాత్రమే ఈ సంస్థలో ఫెలోషిప్ దక్కుతుంది. జీర్ణకోశ వ్యాధుల చికిత్సలో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 2020 సంవత్సరానికిగానూ ఫెలోషిప్ అందజేస్తున్నట్లుగా ఏఏఏఎస్ ప్రకటించింది. ఫిబ్రవరి 13, 2021న నిర్వహించనున్న కార్యక్రమంలో అధికారిక ధ్రువపత్రంతోపాటు శాస్త్ర సాంకేతికకు ప్రతీకగా రూపొందించిన బంగారం, నీలి రంగుతో కూడిన బ్యాడ్జిని ఆయనకు అందజేస్తారు. గడిచిన 50 ఏళ్లలో ఈ ఘనత సాధించిన ఏకైక భారత వైద్యుడు డాక్టర్ నాగేశ్వరరెడ్డి అని ఏఐజీ వర్గాలు వెల్లడించాయి.
పరిశోధనలతో అత్యున్నత చికిత్సా విధానాలు
జీర్ణకోశ సంబంధ వ్యాధులకు అత్యాధునిక, వినూత్న పరిశోధనలతో కూడిన అత్యున్నత చికిత్స విధానాలను బహుళస్థాయిలో విస్తృతపరిచిన ఘనత నాగేశ్వరరెడ్డి సొంతం. ముఖ్యంగా క్లోమగ్రంధి సమస్యలను ఎండోస్కోపీ ద్వారా నిర్ధారించడంతోపాటు, అత్యాధునిక చికిత్సా విధానాలను ఆయన ప్రపంచానికి పరిచయం చేశారు. జీర్ణ వ్యవస్థలో అతి సూక్ష్మ భాగాల్లో తలెత్తిన రుగ్మతలనూ ఎండోస్కోపీ సాయంతో గుర్తించి విజయవంతంగా చికిత్స అందించడంలో ఖ్యాతి గడించారు. అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థలో ఫెలోషిప్ దక్కడం ఆనందాన్నిస్తోందని ఈ సందర్భంగా నాగేశ్వరరెడ్డి అన్నారు. ఇది తన బాధ్యతను మరింత పెంచిందని, జీర్ణకోశ వ్యాధులకు సంబంధించి సంక్లిష్టమైన చికిత్సల్లో విజయాలను సాధించడంపై పరిశోధనలు కొనసాగిస్తూనే ఉంటానని తెలిపారు.
1878 నుంచి ఆరంభం
ఏఏఏఎస్‌లో ఫెలోషిప్ ప్రదానం 1874లో ప్రారంభమైంది. 1878లో ప్రముఖ శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసిన్‌కు దక్కింది. 2020కిగానూ ప్రపంచవ్యాప్తంగా 489 మందికి ఈ ఫెలోషిప్ ఇచ్చారు.