President Draupadi Murmu Visited NISTC : సమాచార, శాస్త్ర సాంకేతిక రంగంలో మహిళలు మరింత ముందంజ వేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. హైదరాబాద్‌లోని నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలను రాష్ట్రపతి సందర్శించారు. రజతోత్సవాలను జరుపుకుంటున్న మహిళా కళాశాలను సందర్శించడం చాలా ఆనందంగా ఉందని రాష్ట్రపతి చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్రెడ్డి పాల్గొన్నారు.
మహిళా సాధికారతను వివరిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించారు. స్త్రీలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారని తెలిపారు. ఆడపిల్లలందరూ కూడా తమ కాళ్ల మీద తాము నిలబడటానికి ప్రయత్నించడం ఎంతో ముఖ్యమని బోధించారు. ప్రస్తుత విద్యా విధానం వల్ల ఎంతో మంది విద్యార్థులకు అభ్యాస సామర్థ్యాలు ఎంతగానో పెరుగుతున్నాయని.. ఇది విద్యాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సాంకేతికత అభివృద్ధి చెందటంలో ఇంజినీర్లదే కీలక పాత్ర అనీ.. అందులో 50 శాతంపైగా మహిళలే అని వారి కీర్తిని కొనియాడారు. రాష్ట్రపతి ఇచ్చిన ప్రసంగం తమను ఎంతగానో ఆకట్టుకుందని విద్యార్థులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
"తాను చాలా విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవాలకు వెళ్లానని, అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా గోల్డ్ మెడల్స్ సాధిస్తున్నారు. బాలికల పట్ల తల్లిదండ్రులు బేధాభావం చూపకుండా.. వారికి అండగా నిలవాలి. మహిళలు చదుకోవడం వల్ల సమాజం బాగుపడుతుంది. అమ్మాయిలు ఉద్యోగం సాధించడమే కాకుండా మరింత మందికి ఉపాధి కల్పించేస్థాయికి ఎదగాలి." -ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి
ఇవీ చదవండి: